Telugu Global
National

ఒకవైపు బీఫ్ మాంసం నిషేధం... మరో వైపు ఎగుమతులకు తహతహ‌

భారత దేశంలో బీఫ్ పేరుతో జరుగుతున్న హింస, దాడులు చూస్తూనే ఉన్నాం. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు బీఫ్ మాంసాన్ని నిషేదించాయి. బీజేపీ బీఫ్ మాంసాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లా దేశ్ కు బీఫ్ మాంసం ఎగుమతి చేయడం కోసం మోదీ సర్కార్ ఎందుకు ఆరాటపడుతోందని ఎమ్ ఐ ఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు

ఒకవైపు బీఫ్ మాంసం నిషేధం... మరో వైపు ఎగుమతులకు తహతహ‌
X

ఇండియా నుంచి బీఫ్ (మాంసం) దిగుమతులను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ను కోరినట్టు వచ్చిన వార్తలపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. మతపరమైన సెంటిమెంట్లతో ఓ వైపు భారత్ లో మాంసం షాపులను మూసివేస్తున్నారని, గోసంరక్షకులు ముస్లిం పశువ్యాపారులపై దాడులు చేస్తున్నారని, కానీ మోడీ ప్రభుత్వం బీఫ్ ఎగుమతుల ద్వారా నిధులు పొందేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదని ఆయన విమర్శించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బీఫ్ ను నిషేధిస్తున్నాయని, కబేళా హౌస్ లను మూసివేస్తున్నాయని.. కానీ ఈ సర్కార్ బీఫ్ ఎగుమతుల ద్వారా బడా వ్యాపారులను ఆదుకోవాలని చూస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

బీఫ్ రవాణా జరగకపోవడంతో ఉభయ దేశాల్లోని బీఫ్ వ్యాపారులు ఇబ్బందులనెదుర్కొంటున్నారని బంగ్లాదేశ్ లోని ఇండియన్ ఎంబసీ దౌత్యాధికారులు ఢిల్లీలోని అధికారులకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇండియా కూడా మా దేశం నుంచి వీటి దిగుమతుల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు వార్తలు వచ్చాయి.

బంగ్లా ప్రభుత్వం తన దిగుమతుల పాలసీలో మార్పులు చేసిన ఫలితంగా గత కొన్ని నెలలుగా ఆ దేశానికి ఇండియా నుంచి శుద్ధి చేసిన మాంసం దిగుమతులు నిలిచిపోయాయి. బీఫ్ రవాణాకు బ్రేక్ పడింది..ఇంతేగాక ఈ దిగుమతుల మీద బంగ్లా జాతీయ బడ్జెట్ లో 20 శాతం అనుబంధ సుంకాన్ని విధించారని, అసెస్ మెంట్ వ్యాల్యూను కూడా పెంచారని ఈ లేఖలో హైలైట్ చేసినట్టు సమాచారం. మంచి నాణ్యత గల బీఫ్ ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటని, ఈ విషయంలో బంగ్లాదేశ్ ఇండియాతో పోటీ పడజాలదని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.

అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాంసం ఉత్పత్తిలో స్వావలంబన సాధించిందని, పైగా తమ దేశంలో పశువుల వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియాతో బాటు 14 దేశాల నుంచి బీఫ్ ని ఆ దేశం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగునున్న బంగ్లా .. మీ బీఫ్ మాకొద్దంటూ ఇండియాకు స్పష్టం చేసింది. అయితే ఎకానమీ కాస్త మసక బారడంతో మా దేశం నుంచి మాంసాన్ని దిగుమతి చేసుకుని నిధులివ్వమంటూ భారత ప్రభుత్వం ఆ దేశాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పడు ఒవైసీ ఇదే అస్త్రంతో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.





First Published:  22 July 2022 11:31 AM IST
Next Story