Telugu Global
National

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సేవా కేంద్రాలు..

పీఎం కిసాన్ సేవా కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా.. 14వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని విడుదల చేస్తారని చెప్పారు మంత్రి కిషన్ రెడ్డి. 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయన్నారు.

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సేవా కేంద్రాలు..
X

ఒకే దేశం.. ఒకే ఎరువు అనే విధానం ద్వారా, భారత్​ బ్రాండ్​ పేరుతో రేపటి నుంచి ఎరువుల సరఫరా మొదలవుతుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా వీటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. తొలిదశలో 1.25 లక్షల షాపులను ప్రధాని మోదీ రేపు ప్రారంభిస్తారని ఈ షాపుల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులో ఉంటుందన్నారు.

రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయని, భూసార పరీక్షలు, సీడ్​ టెస్టింగ్​ సౌకర్యాలు కూడా ఇక్కడ ఉంటాయన్నారు. కిసాన్​ సేవా కేంద్రాల్లో అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు.. అమ్మకానికి అందుబాటులో పెడుతున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లు కూడా అందుబాటులో ఉంచుతామంటున్నారు. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు కిసాన్​ సేవా కేంద్రాలు అవగాహన కల్పిస్తాయన్నారు. సీడ్​ టెస్టింగ్​ తోపాటు, వ్యవసాయానికి ఉపయోగించే నీటిని కూడా పరీక్షిస్తారని.. ఇది దేశవ్యాప్తంగా తొలిసారి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు మంత్రి కిషన్ రెడ్డి.


కిసాన్ కి బాత్..

పంటల భీమా పథకం పట్ల బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మంత్రి కిషన్ రెడ్డి. రైతుల ఇబ్బందులు, సమస్యలను ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్​ కి బాత్​’ పేరుతో ప్రతి నెల రెండో ఆదివారం రైతుల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కిసాన్​ సేవా కేంద్రం​ పరిధిలో ఉండే రైతులతో వాట్సప్​ గ్రూప్​ క్రియేట్​ చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్​ సమాచారం చేరవేస్తామన్నారు.

మోదీ ప్రధాని అయిన తర్వాత 2014నుంచి నీమ్​ కోటెడ్​ యూరియా సరఫరా చేయడం మొదలైందని, దీంతో యూరియా బ్లాక్​ మార్కెట్​ సమస్య తొలగిపోయిందని చెప్పారు కిషన్ రెడ్డి. రేపటి నంచి నీమ్ ​కోటెడ్​ యూరియాతోపాటు సల్ఫర్​ కోటెడ్​ యూరియా కూడా దేశమంతా అందుబాటులోకి వస్తుందన్నారు.

పీఎం కిసాన్ నిధులు కూడా..

పీఎం కిసాన్ సేవా కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా.. 14వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని విడుదల చేస్తారని చెప్పారు మంత్రి కిషన్ రెడ్డి. 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయన్నారు. తెలంగాణకు సంబంధించి 39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ కేంద్రాలను ప్రధాని రేపు లాంఛనంగా ప్రారంభించబోతుండగా.. శామీర్ ​పేటలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.

First Published:  26 July 2023 11:45 AM GMT
Next Story