Telugu Global
National

ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ.. గెహ్లాత్ వ్యాఖ్యల కలకలం

గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రధాని అభ్యర్థి విషయంలో ముందుగా స్పందించలేదు. ఇప్పుడు కూడా ఆ పార్టీ ముందుగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. అయితే రాజస్థాన్ సీఎం గెహ్లాత్ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కలకలం రేపాయి.

ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ.. గెహ్లాత్ వ్యాఖ్యల కలకలం
X

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ప్రకటించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్. 26 పార్టీల ఇండియా కూటమి చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారాయన. అయితే కూటమి ఉమ్మడి అభ్యర్థి రాహుల్ అని మాత్రం చెప్పలేదు. కూటమి చర్చల తర్వాత కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని మాత్రం తెలిపారు. ఈ విషయాన్ని ఇటు కూటమి తరపున కూడా ఎవరూ ధృవీకరించలేదు, అటు గాంధీ కుటుంబం నుంచి కూడా ఇంకా ఎవరూ స్పందించలేదు.

గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రధాని అభ్యర్థి విషయంలో ముందుగానే స్పందించలేదు. ఇప్పుడు కూడా ఆ పార్టీ ముందుగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. అయితే రాజస్థాన్ సీఎం గెహ్లాత్ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కలకలం రేపాయి. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న గెహ్లాత్, రాజస్థాన్ సీఎం పదవి వదులుకోవాల్సి వస్తుందనే సరికి అప్పట్లో వెనకడుగు వేశారు. ఇప్పుడు అదే గెహ్లాత్ ప్రధాని అభ్యర్థి అంటూ రాహుల్ గాంధీ పేరు ప్రకటించడం విశేషం.

ఇండియా కూటమితో ఎన్డీఏలో భయం..

ఇండియా కూటమి బెంగళూరు మీటింగ్ తర్వాత ఎన్డీఏ కూటమిలో భయం మొదలైందని చెప్పారు అశోక్ గెహ్లాత్. 26 పార్టీల బలం తమ కూటమికి ఉందన్నారు. గతంలో బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. మిగిలిన 69 శాతం మంది ప్రజలు ఆయన్ను వ్యతిరేకించారని చెప్పారు. 2024 ఎన్నికల్లో మోదీకి ఓట్లు తగ్గుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే 2014లో మోదీ ప్రధాన మంత్రి అయ్యారని, ఇప్పుడు అదే పార్టీ వల్ల ఆయన గద్దె దిగబోతున్నారని తెలిపారు.

చంద్రయాన్ క్రెడిట్ మాదే..

చంద్రయాన్-3 విజయం క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు అశోక్ గెహ్లాత్. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కృషితోనే ఇప్పుడు ఇస్రో ఈ విజయాలు సాధిస్తోందని తెలిపారు. వారి కఠోర శ్రమ వల్లే నేడు భారతావని అంతరిక్షయానంలో అప్రతిహతంగా దూసుకుపోతోందన్నారు.

First Published:  27 Aug 2023 12:14 PM IST
Next Story