Telugu Global
National

గ్రామీణ కార్మికుల దుస్థితి: రోజు రోజుకు పడిపోతున్న వాస్తవ వేతనాలు...పట్టని ప్రభుత్వం

వ్యవసాయ శ్రామికశక్తిలో, చిన్న రైతులు కూడా ఉన్నారు. 11 ఏళ్ల క్రితం పూర్తయిన జనాభా లెక్కల ప్రకారం భూమిలేని కూలీల సంఖ్య దాదాపు 14 కోట్లుగా అంచనా వేయబడింది. గత ట్రెండ్‌లను బట్టి చూస్తే, ఈ సంఖ్య ఇప్పుడు పెరిగింది.

గ్రామీణ కార్మికుల దుస్థితి: రోజు రోజుకు పడిపోతున్న వాస్తవ వేతనాలు...పట్టని ప్రభుత్వం
X

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమర్పించిన 2022-23 ఆర్థిక సర్వేలో, గ్రామీణ శ్రామికులకు సంబంధించిన దిగ్భ్రాంతికి గురిచేసే సమాచారం ఉంది. ప్రభుత్వానికి చెందిన‌ స్వంత ఆర్థికవేత్తలు చేసిన లెక్కల ప్రకారం, గ్రామీణ శ్రామికుల వాస్తవ వేతనాలు - అంటే ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయబడిన వేతనాలు - గత రెండేళ్ళలో తగ్గాయి. లేదా రెండేళ్ళ క్రితం ఉన్నట్టే ఉన్నాయి. గ్రామీణ భారతదేశంలో దాదాపు 36.5 కోట్ల మంది కార్మికులు ఉన్నారని, వీరిలో 61.5% మంది వ్యవసాయంలో, 20% పరిశ్రమలలో, 18.5% మంది సేవా రంగంలో పనిచేస్తున్నారని గత‌ సర్వే పేర్కొంది.

వారి కుటుంబాలను కూడా కలుపుకుంటే, ఆ సంఖ్య మూడు రెట్లు లేదా నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా నిజ వేతనాలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇది దారుణ‌మైన పేదరికానికి దారి తీస్తున్న‌ది.

వ్యవసాయ శ్రామికశక్తిలో, చిన్న రైతులు కూడా ఉన్నారు, వారు తక్కువ భూమిని కలిగి ఉంటారు. 11 ఏళ్ల క్రితం పూర్తయిన జనాభా లెక్కల ప్రకారం భూమిలేని కూలీల సంఖ్య దాదాపు 14 కోట్లుగా అంచనా వేయబడింది. గత ట్రెండ్‌లను బట్టి చూస్తే, ఈ సంఖ్య ఇప్పుడు పెరిగింది.

లక్షలాది మంది సన్నకారు, చిన్న రైతులు కూడా తరచుగా కూలీ పనుల మీద ఆధారపడటం వల్ల ఈ సంఖ్య పెరుగుతుంది. వారు తమ తక్కువ భూముల్లో తగినంత రాబడి రానందువల్ల‌ ఇతరుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తారు. ఈ పనులు సంవత్సరమంతా ఒకే రకంగా ఉండవు. కొన్ని నెలల్లో అసలు పనులే ఉండవు. పైగా వీళ్ళు తరచుగా సామాజిక అణచివేతకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ కార్మికులలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, తెగలు,ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు కాబట్టి.

ఇక‌ వారి వేతనాలు చూస్తే. అక్టోబర్ 2022లో పురుషులకు రోజువారీ వేతనం రూ.364 కాగా, మహిళలకు రూ.271. అంటే పురుషులకు నెలకు రూ.11,000, మహిళలకు రూ.8,000. మే 2020తో పోల్చితే, ఈ వేతన రేట్లు పురుషులకు 17%, మహిళలకు 12% పెరుగుదలను చూపుతాయి. కానీ ఈ పెరుగుదల భ్రమ మాత్రమే.

ఆ కాలంలో ధరల పెరుగుదలను లెక్కల్లోకి తీసుకొని చూస్తే నిజమైన వేతనాలు వాస్తవానికి పడిపోయాయి. పురుషులకు, నిజమైన వేతనాలు రోజుకు రూ.207 నుండి రూ.204కి స్వల్పంగా తగ్గగా, మహిళలకు రోజుకు రూ.160 నుండి రూ.152కి పడిపోయింది.

ఈ ఆదాయాలు సంవత్సరం అంతా ఉండవు.సంవత్సరంలో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే వ్యవసాయ పని అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద, బహుశా ఒక వ్యవసాయ కార్మికుడికి ఒక సంవత్సరంలో 3-4 నెలల మాత్రమే వ్యవసాయ పని దొరుకుతోంది. దీంతో మిగతా సమయాల్లో వ్యవసాయేతర పనులు చూసుకోవాల్సి వస్తోంది.

వ్యవసాయేతర పని, ఒక వ్యక్తి పార్ట్-టైమ్ ప్రాతిపదికన ఏకకాలంలో 3-4 వృత్తులను చేయవలసి వస్తుంది. వివరాల్లోకి వెళ్తే విస్మయపరిచే విషయాలు బహిర్గతమవుతాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక ట్రేడ్ యూనియన్ చేసిన సర్వేలో ఒకే గ్రామంలో 61 రకాల పనులున్నాయి. నిర్మాణం, రిటైల్ వ్యాపారం, మరమ్మత్తు ఉద్యోగాలు, ఇంటి పని మొదలైనవి.

ఈ పనుల్లో...మే 2020,అక్టోబర్ 2022 మధ్య పురుషులకు వేతనాలు రోజుకు రూ.381 నుండి రూ.408కి పెరిగాయి. అదే సమయంలో మహిళలకు రోజువారీ వేతనాలు రోజుకు రూ.226 నుండి రూ.269కి పెరిగాయి.

ధరల‌ పెరుగుదలకు సర్దుబాటు చేసిన తర్వాత, వేతనాలు చూస్తే,. పురుషుల రోజువారీ కూలీ రూ.229కి తగ్గగా, మహిళలకు రూ.151కి స్వల్పంగా పెరిగింది.

వ్యవసాయంవల్ల సంవత్సరం పూర్తిగా పనులు దొరకని లక్షలాది మందికి వ్యవసాయేతర పనులు కడుపు నింపలేకపోతున్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుడు పేదరికంతో జీవితం సాగించాల్సి వస్తున్నది.

కాగా ఉచిత వైద్యం, ఉచిత విద్య, పౌష్టికాహారం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడం లేదా కోత పెట్టడం వల్ల ఈ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. వారి సంపాదన ప్రైవేట్ వైద్యులు, ప్రైవేటు పాఠశాలలకు చెల్లించడానికి ఏ మాత్రం సరిపోదు. కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లయితే ఆ కుటుంబం, బంధువులు, స్నేహితులు లేదా వడ్డీ వ్యాపారుల నుండి రుణం తీసుకోవాల్సి వస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) చేసిన వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన చివరి సర్వేలో 50% వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని తేలింది.

అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ఈ కార్మికులకు, ఇతరులకు కూడా జీవనాధారాన్ని అందిస్తుంది. అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం, ఇప్పటి వరకు 8.19 కోట్ల మంది ఇప్పటికే ఈ పథకం కింద పనిచేశారు. భూమిలేని కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతర గ్రామీణ కార్మికులు ఈ పథకాన్ని ఆశ్రయించడం వలన పనికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

కానీ ఒక్కసారి MGNREGSలో అందించే వేతనాలను చూడండి: ప్రస్తుత సంవత్సరంలో, సగటు రోజువారీ కూలీ రేటు సుమారు రూ.218, గత సంవత్సరం ఇది రూ.209, అంతకు ముందు సంవత్సరం రూ.201. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా చూస్తే ప్రస్తుత సంవత్సరానికి కూలీ రేటు రోజుకు దాదాపు రూ.122. ఇది అక్టోబర్ 2022లో వ్యవసాయేతర పనులకు వచ్చిన‌ వేతనం కంటే రూ.100 తక్కువ.

75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న ఈ అమృత్‌కాల్‌లో వ్యవసాయ కార్మికుల వేతనాలతో సహా పని పరిస్థితులను క్రమబద్ధీకరించడానికి ఇప్పటికీ సమగ్ర చట్టం లేకపోవడం విషాదకరం. ఏళ్ల తరబడి వివిధ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

మన దేశం అభివృద్ది పథంలో దూసుకపోతున్నదని, మనది 5ట్రిలియన్ కోట్ల ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలో అన్ని రంగాల్లో మనమే ముందున్నామని చెప్తున్న ప్రభుత్వాల లెక్కలను గ్రామీణ భారతం వెక్కిరిస్తోంది.

First Published:  13 Feb 2023 8:57 AM IST
Next Story