Telugu Global
National

ఇది డీప్‌ ఫేక్‌ కాలం.. ఫొటోలకు ఆధారాలు ఇవ్వాల్సిందే.. - తేల్చిచెప్పిన హైకోర్టు

ఢిల్లీకి చెందిన ఓ ఆర్కిటెక్టుకు 2018లో వివాహమైంది. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.

ఇది డీప్‌ ఫేక్‌ కాలం.. ఫొటోలకు ఆధారాలు ఇవ్వాల్సిందే.. - తేల్చిచెప్పిన హైకోర్టు
X

దంపతులు ఒకరిపై మరొకరు ఫొటోలు, వీడియోల సాయంతో నిందలు మోపే ముందు వాటిని నిరూపించగలిగేలా కచ్చితమైన ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డీప్‌ ఫేక్‌ లాంటివి ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించలేని స్థాయికి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. దంపతులకు సంబంధించిన ఒక కేసులో శనివారం నాడు న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యానించింది.

ఢిల్లీకి చెందిన ఓ ఆర్కిటెక్టుకు 2018లో వివాహమైంది. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మైనర్‌ అయిన బిడ్డతో కలిసి తనకు దూరంగా ఉంటున్న భార్యకు మరొకరితో సంబంధం ఉందంటూ.. తన ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆధారంగా చూపుతూ భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేశాడు. ఆ తీర్పు పెండింగులో ఉండటంతో.. అప్పటివరకూ తనకు నెలకు రూ.2 లక్షల భరణం చెల్లించాలని భార్య న్యాయస్థానాన్ని కోరింది. ఆమె వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రతి నెలా రూ.75 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.

కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. భార్యకు వేరొకరితో సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఫొటోలను కూడా న్యాయస్థానానికి సమర్పించాడు. అయితే భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రాజీవ్‌ శక్‌దర్, జస్టిస్‌ అమిత్‌ బన్సల్‌ ధర్మాసనం శనివారం తోసిపుచ్చింది. విచారణ అనంతరం ఆరోపణలను నిరూపించగలిగే సాక్ష్యాలతో కుటుంబ న్యాయస్థానాన్నే ఆశ్రయించాలని ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది.

First Published:  9 Jun 2024 4:46 AM GMT
Next Story