Telugu Global
National

సున్నా మార్కులొచ్చినా ప‌ర్లేదు.. డబ్బులుంటే పీజీ మెడికల్‌ సీటు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) వెల్లడించడం గుర్తించాల్సిన అంశం.

సున్నా మార్కులొచ్చినా ప‌ర్లేదు.. డబ్బులుంటే పీజీ మెడికల్‌ సీటు
X

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ముందు మోకరిల్లింది. మెడికల్‌ పీజీ సీట్ల పేరుతో కోట్ల కొద్దీ సొమ్మును డిమాండ్‌ చేసి మరీ.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కొల్లగొట్టేందుకు ఆ కాలేజీల‌కు రాజమార్గం ఏర్పాటు చేసింది. అదెలా అంటే.. పీజీ మెడికల్‌ సీటు పొందాలంటే నీట్‌లో సున్నా మార్కులొచ్చినా ప‌ర్లేదంట‌.. సీటు ఇచ్చేస్తారంట. ఇదేదో విద్యార్థులను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయం అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ నిర్ణయం వల్ల కేవలం మెడికల్‌ కాలేజీలు కోట్ల కొద్దీ సొమ్ము సీట్ల కేటాయింపు కోసం డిమాండ్‌ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కొల్లగొట్టేందుకు అధికారికంగా ఏర్పాటుచేసిన మార్గం కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) వెల్లడించడం గుర్తించాల్సిన అంశం.

నీట్‌ పీజీ సీట్ల భర్తీలో భాగంగా ఇప్పటికే రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తయింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ కటాఫ్‌ మార్కులను 291గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257, దివ్యాంగులకు 274గా పేర్కొని మొదటి రెండు రౌండ్లలో కన్వీనర్‌ కోటాలో సీట్లు భర్తీ చేశారు. ఇంకా 13 వేలకు పైగా సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఇవి ఎక్కువ‌గా సీ కేట‌గిరి సీట్లు. ఇన్ని వేల సీట్లు ఖాళీగా ఉండ‌టానికి కార‌ణం విద్యార్థులు లేక కాదు.. డిమాండ్ లేక కాదు.. అన్న‌న్ని కోట్లు డొనేష‌న్లు క‌ట్ట‌లేక‌. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న కొత్త నిర్ణ‌యంతో కోట్లు కుమ్మ‌రించ‌గ‌లిగిన వాళ్లు ఈ సీట్లు కొనుక్కునే ప‌రిస్థితి ఉంది. దాంతో ప్రైవేట్ కాలేజీల ప‌ని హాయి.

ఈ క్రమంలో వాటి భర్తీ కోసం కటాఫ్‌ మార్కుల నిబంధన తొలగిస్తూ మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అంటే అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (నీట్‌ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్టు నిబంధనలు మార్చింది.

అంటే.. మార్కుల అర్హత లేకపోయినా ఫర్లేదు.. కోట్లు కుమ్మరించే సామర్థ్యం ఉంటే చాలు.. సీటు వచ్చేస్తుంది. ఈ క్రమంలో పీజీ మెడికల్‌ కాలేజీలు డిమాండ్‌ చేసే సొమ్ము చెల్లించలేక.. సున్నా మార్కులు వచ్చినవారితో డబ్బు విషయంలో పోటీపడలేక.. మెరుగైన మార్కులు వచ్చినవారు సైతం సీటు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని అడ్డుకోవాల్సిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖే దీనికి అనుమతించడం అంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ముందు మోకరిల్లడం కాక మరేమవుతుంది?

ఇకపోతే కటాఫ్‌ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ఇప్పటికే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. అర్హత పర్సంటైల్‌ను తగ్గించిన కారణంగానే మూడో రౌండ్లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామంది.

*

First Published:  21 Sept 2023 10:59 AM IST
Next Story