Telugu Global
National

డీజిల్ కార్లు ఇక షెడ్డుకే.. భారత్ లో కష్టం

సెకండ్ సేల్స్ లో కూడా పెట్రోల్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. డీజిల్ కార్లు అంటే కస్టమర్లు ఆసక్తి చూపించడంలేదు. డీజిల్ కారుని సెకండ్స్ లో వదిలించుకోవాలన్నా కష్టమే.

డీజిల్ కార్లు ఇక షెడ్డుకే.. భారత్ లో కష్టం
X

కరోనా కాలంలో వాహన రంగం తీవ్ర ఇబ్బందులకు లోనైంది. అయితే ఆ తర్వాత మాత్రం విపరీతంగా పుంజుకున్నట్టు కనపడుతోంది. కానీ ఐదేళ్లలో వచ్చిన మార్పుని చూస్తే భారత్ లో డీజిల్ కార్లు మాయమైపోవడానికి ఎక్కువరోజులు సమయం పట్టేలా లేదు. అవును, డీజిల్ కార్ల తయారీతోపాటు, విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో డీజిల్ కార్ల అమ్మకాలు కేవలం 19 శాతం. అంటే నూటికి 19 కార్లు మాత్రమే డీజిల్ మోడల్స్ బయటకొచ్చాయి. 70శాతం మంది ప్రజలు పెట్రోల్ కార్లనే కొనుగోలు చేశారు. మిగతా 12 శాతం సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ గణాంకాలన్నీ డీజిల్ కార్లకు కాలం చెల్లినట్టేనని తేల్చేస్తున్నాయి.

కారణం ఏంటి..?

పెట్రోల్, డీజిల్ మోడల్స్ లో డీజిల్ కార్ల రేటు కాస్త ఎక్కువ. మెయింటెనెన్స్ కూడా ఎక్కువే. కానీ డీజిల్ ఇంజిన్ సామర్థ్యంపై ఉన్న నమ్మకం, పనితీరు, డీజిల్ రేటు తక్కువగా ఉండటంతో గతంలో ఎక్కువగా కస్టమర్లు వాటినే ఇష్టపడేవారు. కానీ రాను రాను డీజిల్ రేటు పెట్రోల్ తో సమానంగా పెరిగింది. దీంతో వాహనదారుల అభిరుచి కూడా మారిపోయింది. మరో ప్రధాన కారణం ప్రభుత్వ కొత్త పాలసీ. డీజిల్‌ వాహనాలను 10 ఏళ్లకు తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. అదే పెట్రోల్‌ వాహనాలకు 15 ఏళ్ల వరకూ అవకాశం కల్పించింది. దీంతో డీజిల్‌ వాహనాల కంటే పెట్రోల్‌ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

సెకండ్ సేల్స్...

సెకండ్ సేల్స్ లో కూడా పెట్రోల్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. డీజిల్ కార్లు అంటే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపించడంలేదు. ఒకవేళ డీజిల్ కారు కావాలన్నా బేరాలాడుతున్నారు. అంటే డీజిల్ కారుని సెకండ్స్ లో వదిలించుకోవాలన్నా కష్టమే. దీంతో అసలు డీజిల్ మోడల్స్ అంటేనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు.

కంపెనీలు కూడా..

కార్ల తయారీ కంపెనీలు కూడా డీజిల్ మోడల్స్ ని దాదాపుగా పక్కనపెట్టేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో భారత్‌ మార్కెట్‌లోకి 28 కొత్త మోడల్‌ కార్లు వచ్చాయి. వాటిలో పెట్రోల్‌ వెర్షన్‌ కార్లు 13, ఎలక్ట్రిక్ కార్లు 8, సీఎన్జీ వెర్షన్ కారు 1 ఉంది. డీజిల్ వెర్షన్ కార్లు 6 లాంచ్ అయ్యాయి. అంటే డిమాండ్ సప్లై రూల్ ప్రకారం తయారీదారులు కూడా పెట్రోల్ కార్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డీజిల్ కార్లను పక్కనపెట్టేశారు. SUV మోడల్స్ ని ఇష్టపడేవారు మాత్రమే డీజిల్ వాహనాలపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  23 March 2023 6:51 AM IST
Next Story