Telugu Global
National

స్కూటీలో పెట్రోల్ కొట్టించి 2వేల నోటిచ్చాడు.. చివరకు ఏమైందంటే..?

దేశవ్యాప్తంగా ఈరోజునుంచి బ్యాంకుల్లో 2వేల నోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే అందరూ బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదు.

స్కూటీలో పెట్రోల్ కొట్టించి 2వేల నోటిచ్చాడు.. చివరకు ఏమైందంటే..?
X

2వేల రూపాయలు సంపాదించడం గొప్ప కాదు, 2వేల నోటుని ఖర్చు పెట్టడం గొప్ప అనుకునే రోజులు వచ్చేశాయి. అవును, 2వేల నోటుని ఖర్చు చేయడం తలకు మించిన భారంగా మారింది. బ్యాంకుల్లో తీసుకుంటారు కానీ లెక్కలు రాసుకుంటారనే భయం వెంటాడుతోంది. అందుకే చాలామంది ఎలాగోలా 2వేల రూపాయల నోట్లను వదిలించుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడే కొందరి ప్లాన్లు బెడిసికొడుతున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి పెట్రోల్ కొట్టించుకుని 2వేల రూపాయల నోటు ఇచ్చిన ఈ స్కూటరిస్ట్ చివరకు ఎన్నితిప్పలు పడాల్సి వచ్చిందో.

చినిగిపోయిన నోటు మార్చాలనుకున్నవారెవరైనా నా దగ్గర ఇదే ఉంది తీస్కుంటే తీసుకో లేకపోతే లేదు అనేస్తారు. సరిగ్గా ఇలాగే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత 2వేల నోటు తీసివ్వబోయాడు ఓ కస్టమర్. ఈ నోటు తీసుకోమండి అని బంకు సిబ్బంది చెప్పినా.. నా దగ్గర ఇదే ఉంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదన్నాడు. అయితే బంకు యజమాని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. 2వేల నోటు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. స్కూటీలో నుంచి పెట్రోల్ వెనక్కు తీసేసుకోవాలని సిబ్బందిని ఆదేశించాడు. దీంతో ఇదిగో ఇలా పైప్ తో పెట్రోల్ వెనక్కి లాగేశారు. ఈ ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌లౌన్ జిల్లాలో జరిగింది.


దేశవ్యాప్తంగా ఈరోజునుంచి బ్యాంకుల్లో 2వేల నోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే అందరూ బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదు. పెట్రోల్ బంకుల్లో, ఇతర షాపుల్లో వాటిని మార్చుకోవాలనుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో 2వేల నోట్లు ఉంటే బంగారం కొనేస్తున్నారు. చాలా చోట్ల షాపుల్లో 2వేల నోట్లు తీసుకోబడవు అనే బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఆ బోర్డ్ లు చూసి కూడా నా దగ్గర 2వేలే ఉందని మొండికేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి.



First Published:  23 May 2023 9:18 PM IST
Next Story