Telugu Global
National

బోరుబావిలో పడింది చిన్నారి కాదు.. వ్యక్తి మృతదేహం వెలికితీత

బోరు బావి 40 అడుగుల లోతు ఉండగా దానికి సమాంతరంగా గొయ్యి తీయడం మొదలుపెట్టారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.

బోరుబావిలో పడింది చిన్నారి కాదు.. వ్యక్తి మృతదేహం వెలికితీత
X

దేశ రాజధాని న్యూఢిల్లీ వికాస్ పురి కేషోపూర్ మండిలోని ఢిల్లీ జల్ బోర్డు ప్లాంట్ బోరుబావిలో పడిన వ్యక్తి మృతిచెందాడు. రెస్క్యూ టీమ్ అతడు చనిపోయినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మంత్రి అతిషి అధికారికంగా ప్రకటించారు. ముందు బోరు బావిలో పడింది చిన్నారి అని అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి బోరు బావిలో పడ్డట్లు అధికారులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి జల్ బోర్డు ప్లాంట్ బోరు బావిలో ఓ చిన్నారి పడినట్లు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బోరు బావి 40 అడుగుల లోతు ఉండగా దానికి సమాంతరంగా గొయ్యి తీయడం మొదలుపెట్టారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బోరు బావి నుంచి బాధితుడిని బయటకు తీశారు. బోరు బావిలో పడింది చిన్నారి కాదని.. 30 ఏళ్ల వ్యక్తి అని గుర్తించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఢిల్లీ మంత్రి అతిషి అధికారికంగా ప్రకటించారు. బోరు బావిలో వ్యక్తి ఎలా పడిపోయాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సకాలంలో విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేసులు మళ్ళీ పున‌రావృతం కాకుండా చూసేందుకు ఢిల్లీలో మూతపడిన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బోర్లను 48 గంటల్లోగా వెల్డింగ్ చేసి సీల్ వేసి నివేదిక సమర్పించాలని జల్ బోర్డుకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కాగా, బోరు బావిలో పడి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాల కోసం ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

First Published:  10 March 2024 5:34 PM IST
Next Story