కాంగ్రెస్ కే పట్టంకట్టిన చత్తీస్ ఘడ్ సర్వే..
2018లో కాంగ్రెస్ కి 43.03 శాతం ఓట్లు రాగా ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో 46 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది.
దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ కాంగ్రెస్ వైపే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 'చత్తీస్ ఘడ్ మూడ్' సర్వేలో కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నట్టు తేలిపోయింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న 5 రాష్ట్రాల్లో చత్తీస్ ఘడ్ కూడా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఏడాది ఎన్నికల్లో దాన్ని నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ చేపట్టిన సర్వే తేల్చింది.
సర్వేలో ఎవరికెన్ని స్థానాలు..
చత్తీస్ ఘడ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు -90
కాంగ్రెస్ 53 నుంచి 60
బీజేపీ 20నుంచి 27
బీఎస్పీ, ఇండిపెండెంట్, ఇతరులు -3 స్థానాలు
అంటే మెజార్టీకి కావాల్సిన 46 స్థానాలను కాంగ్రెస్ ఈజీగా సొంతం చేసుకుంటుంది. ఎలాంటి జిమ్మిక్కులు, మేజిక్కులు చేసినా బీజేపీకి ఛాన్సే లేదని తేలిపోయింది.
2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి 68 సీట్లు వచ్చాయి, కొన్నిచోట్ల ఉపఎన్నికలు జరుగగా కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. ఈసారి ఆ స్థాయిలో సీట్లు రాకపోయినా అధికారం మాత్రం కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని సర్వేల సారాంశం. మరో విశేషం ఏంటంటే 2018లో కాంగ్రెస్ కి 43.03 శాతం ఓట్లు రాగా ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో 46 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది.
బీజేపీకి పరాభవమే..!
చత్తీస్ ఘడ్ ని బీజేపీ 15 సంవత్సరాల పాటు పాలించింది. 2003, 2008, 2013 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించింది. 2018లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. అయితే మరుసటి ఏడాది 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చత్తీస్ ఘడ్ లోని 11 స్థానాల్లో 10చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కానీ ఆ ప్రభావం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించదని అంటున్నారు.
కాంగ్రెస్ బలాలు..
కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం సీఎం భూపేష్ భఘేల్ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకం. 'ఛత్తీస్ ఘడ్ మాతారి', 'గదో నవా ఛత్తీస్ ఘడ్' వంటి నినాదాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. స్థానిక పండగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్ ఘడ్ ఒలింపిక్స్ పేరుతో సొంతంగా క్రీడా పోటీలు నిర్వహించి విజయవంతం చేయడం, రాష్ట్ర గీతం 'అర్ప పైరి కి ధర్' ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్ అంశాలు కాంగ్రెస్ కి కలిసొచ్చాయి. 'బెన్ ములాఖత్' పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యారు. దీంతో రెండోసారి కూడా కాంగ్రెస్ కి అక్కడ అధికారం ఖాయం అని తేలిపోయింది.
'కహో దిల్ సే, కాంగ్రెస్ ఫిర్ సే'
'భూపేష్ హై తో, భరోసా హై'
వంటి నినాదాలతో ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ పాలనపై 20శాతం మంది సంతృప్తిగా ఉన్నామని, 31 శాతం మంది పాక్షిక సంతృప్తితో ఉన్నామని, 21 శాతం మంది పాక్షిక అసంతృప్తి, 17శాతం మంది పాక్షిక సంతృప్తితో ఉన్నామని సర్వేకు స్పందించారు.
బలహీనతలు
ఉత్తర చత్తీస్ ఘడ్ ప్రాంతంలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ డివిజన్‌లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బలమైన నేత సింగ్ డియోకి సీఎం పోస్ట్ ఇస్తారనే ప్రచారంతో 2018లో కాంగ్రెస్ కి ఓట్లు కుమ్మేశారు. అయితే ఆ తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ తో సరిపెట్టింది అధిష్టానం. సింగ్ డియో అభిమానులు, ఆయన వర్గం ఓటర్లు కాంగ్రెస్ పై కోపంతో ఉన్నారు. ఆ అసంతృప్తి ఈసారి ఎన్నికలపై కనపడుతుందనే అనుమానాలున్నాయి. చత్తీస్ ఘడ్ దక్షిణ ప్రాంతం బస్తర్ లో మావోయిస్ట్ లప్రభావం ఉంది, ఇక్కడ వామపక్షాలు బలపడుతున్నాయి. ఇటీవల మతకలహాలు, హింసతో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత పెరిగింది.
2023 జూన్ 1 నుంచి 30 వరకు పీపుల్స్ పల్స్ సంస్థ చత్తీస్ ఘడ్ లో ఈ సర్వే చేపట్టింది. 25మందితో ఉన్న నాలుగు బృందాలు మొత్తం 5000 కిలోమీటర్లు పర్యటించి వివరాలు సేకరించాయి. సర్వే నిర్వహించిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 35 నుంచి 40 శాంపిల్స్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3000 శాంపిల్స్ సేకరించారు. కులం, ప్రాంతం, స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారికి సమప్రాధాన్యత ఇస్తూ ఈ సర్వే చేపట్టారు. కర్నాటకలో పీపుల్స్ పల్స్ సర్వే నిజమని తేలిపోయింది. చత్తీస్ ఘడ్ లో కూడా ఈ సర్వేపై అవే అంచనాలున్నాయి.