Telugu Global
National

పీపుల్స్ పల్స్.. కాంగ్రెస్ దే కర్నాటక

మేనిఫెస్టో విషయానికొస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే కనపడుతోంది.

పీపుల్స్ పల్స్.. కాంగ్రెస్ దే కర్నాటక
X

అసెంబ్లీ ఎన్నికలకింకా మూడు రోజులు టైమ్ ఉన్న సందర్భంలో కర్నాటకలో తాజా ప్రీపోల్ సర్వే ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం పీపుల్స్ పల్స్ సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఊహించినట్టుగానే కాంగ్రెస్ కి అధికారం వస్తుందని పీపుల్స్ పల్స్ చెప్పినా మెజార్టీ మాత్రం స్వల్పంగానే ఉంటుందని తేల్చేసింది.

పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌ రెడ్డి నేతృత్వంలో మే-1 నుండి మే-5 వరకు ఈ సర్వే నిర్వహించారు. ‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (PPS) పద్ధతి ద్వారా 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేసి 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. అన్ని వర్గాలవారిని పరిగణలోకి తీసుకుని మొత్తం 3360 శాంపిల్స్‌ సేకరించి తుది ఫలితాలు విడుదల చేశారు.

ఇది మూడో సర్వే..

కర్నాటకలో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ మొదటి ప్రీ పోల్‌ సర్వేను 2022 డిసెంబర్‌ 22వ తేదీ నుండి 31వరకు నిర్వహించింది. రెండో ప్రీపోల్ సర్వేను 2023 మార్చి 25 నుండి ఏప్రిల్ 10 వరకు చేపట్టారు. మూడో ప్రీపోల్‌ సర్వేను 2023 మే1 నుండి మే 5 వరకు నిర్వహించారు. మొత్తంగా కర్నాటక రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే చేపట్టారు.

ఆనవాయితీ..

కర్నాటకలో గత మూడున్నర దశాబ్దాలుగా అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టిన ఉదాహరణ లేదు. చరిత్రను మార్చాలని తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది. సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజగా విడుదలైన పీపుల్స్ పల్స్ మూడో సర్వే కూడా కాంగ్రెస్ మెజార్టీని ఖాయం చేసింది. కోస్తా కర్నాటక మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉందని తేలిపోయింది.

224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో ఏ పార్టీ అయినా 113 స్థానాలు సాధిస్తేనే ఎవరి మద్దతు అవసరం లేకుండా అధికారం చేపట్టే అవకాశముంటుంది. కాంగ్రెస్ కి 105-117 స్థానాలు దక్కే అవకాశముందని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది. బీజేపీకి 81-93 స్థానాలు, జేడీ(ఎస్‌)కు 24-29 స్థానాలు వస్తాయని అంచనా. ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ ఓట్ల శాతంలో పెరుగుదల..

2018లో కాంగ్రెస్ కి 38.14 శాతం ఓట్లు లభించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఈసారి కాంగ్రెస్‌ కి 41.4 శాతం ఓట్లు వస్తాయి. 2018లో 36.35 శాతం ఓట్లు పొందిన అధికార బీజేపీ ఇప్పుడు 36 శాతానికి పరిమితం అవుతుంది. జేడీఎస్ కి కూడా ఓట్ల శాతం పడిపోతుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

సీఎంగా సిద్ధరామయ్యను అత్యధికంగా 42శాతం మంది కోరుకుంటున్నట్టు పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది. బొమ్మై నాయకత్వం కావాలని కేవలం 24శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారట. ఈ రేసులో యడ్యూరప్ప, డీకే శివకుమార్ కి పెద్దగా మార్కులు పడలేదు. అభివృద్ధి విషయానికొస్తే.. కాంగ్రెస్ ద్వారా కర్నాటక అభివృద్ధి చెందుతుందని 46 శాతం మంది చెబితే, బీజేపీతో కర్నాటక అభివృద్ధి చెందుతుందని 34 శాతం మంది అంటున్నారు. బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వబోమని 53శాతం మంది క్లారిటీ ఇచ్చారట.

అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ ని నిషేధిస్తామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనని వ్యతిరేకిస్తూ బీజేపీ రాజకీయంగా లాభపడే ప్రయత్నం చేసింది. ఆ దిశగా జనాల్లోకి ఈ అంశాన్ని విజయవంతంగా తీసుకెళ్లిందని పీపుల్స్ పల్స్ సంస్థ చెబుతోంది. ఇక కేరళ స్టోరీ సినిమా వ్యవహారం పెద్దగా బీజేపీకి వర్కవుట్ కాలేదట. గ్యాస్ సిలిండర్ల రేటు పెరగడం అనే అంశాన్ని కాంగ్రెస్ బలంగా జనాల్లోకి తీసుకెళ్లింది. నిరుద్యోగ అంశం కూడా బీజేపీపై వ్యతిరేకత పెంచినా.. యువత కులాల వారీగా విడిపోయి ఆయా పార్టీలకు మద్దతివ్వడం కమలనాథులకు ఊరటనిచ్చే అంశం. కర్నాటకలో కమీషన్ల ప్రభుత్వం ఉందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నా.. ప్రజలు అవినీతిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ సమానంగా నష్టపోతున్నాయని తెలుస్తోంది.

మేనిఫెస్టో విషయానికొస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే కనపడుతోంది. సంక్షేమ పథకాల ప్రకటనలో బీజేపీ వెనకడుగు వేయడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది. ప్రచారం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కంటే ముందంజలో ఉన్నట్టు తేలిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు మల్లికార్జున్ ఖర్గే సహా కీలక నేతలంతా కర్నాటకలో పర్యటించారు. బీజేపీ విషయంలో ప్రధాని మోదీ మాత్రమే ఉత్సాహంగా కనిపించినా మిగతా కేంద్ర మంత్రులు కర్నాటకలో పర్యటించలేకపోయారు.

First Published:  7 May 2023 3:12 PM IST
Next Story