Telugu Global
National

కాంగ్రెస్సే కావాలి.. ఓటు వేశాక పీపుల్స్ పల్స్

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి బొటాబొటి సీట్లు వస్తే, తిమ్మిని బమ్మిని చేసి అధికారాన్ని కైవసం చేసుకునే దారులు వెతుక్కోవచ్చనుకుంది బీజేపీ. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ ని చేరుకునే అవకాశాలే ఎక్కువ అని తేల్చేశాయి.

కాంగ్రెస్సే కావాలి.. ఓటు వేశాక పీపుల్స్ పల్స్
X

కర్నాటక అసెంబ్లీ సమరానికి సంబంధించి ప్రీ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ కే బలముందని తేల్చేసినా.. బీజేపీకి ఎక్కడో చిన్న ఆశ ఉంది. కానీ ఆ ఆశ కూడా అడియాసేనని పీపుల్స్ పల్స్ తేల్చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ దే పైచేయి అని తీర్మానించింది. పీపుల్స్ పల్స్ -సౌత్ ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ లో కర్నాటకలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని తేలిపోయింది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివి..

కాంగ్రెస్‌ 107-119

బీజేపీ 78-90

జేడీ(ఎస్‌) 23-29

ఇతరులు 1-3 సీట్లు

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి బొటాబొటి సీట్లు వస్తే, తిమ్మిని బమ్మిని చేసి అధికారాన్ని కైవసం చేసుకునే దారులు వెతుక్కోవచ్చనుకుంది బీజేపీ. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ ని చేరుకునే అవకాశాలే ఎక్కువ అని తేల్చేశాయి. పీపుల్స్ పల్స్ సంస్థ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 107నుంచి 119 స్థానాలు లభించే అవకాశముంది. కర్నాటకలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకయినా 113 స్థానాలు రావాలి. ఆ లెక్కన కాంగ్రెస్ మెజార్టీ ముంగిట ఆగిపోతే ఇండిపెండెంట్ల బలంతో అయినా గట్టెక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 42 శాతం, బిజెపికి 36 శాతం, జేడీ(ఎస్‌)కు 16 శాతం ఓట్లు పడ్డాయి. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 4 శాతం ఓట్లు అధికంగా వస్తాయని అంచనా. అదే సమయంలో బీజేపీ 0.35 ఓట్ల శాతాన్ని కోల్పోతోంది. కర్నాటకలోని మొత్తం 6 రీజియన్లలో ఐదింటిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా కోస్తా కర్నాటకలో మాత్రం బీజేపీకి మెజార్టీ లభించే అవకాశముంది.

మేనిఫెస్టోయే కాంగ్రెస్ బలం..

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోయే ఆ పార్టీకి బలంగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశముందని తెలుస్తోంది.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. ప్రధానంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెరుగుదల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించకపోవడంతో బీజేపీపై వారు కసి తీర్చుకున్నారని అర్థమవుతోంది. కమీషన్ రాజ్ సర్కార్ అనే ప్రచారం కూడా కాంగ్రెస్ కి కలిసొచ్చినట్టు స్పష్టమవుతోంది. బీజేపీనుంచి వలసలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభావంతో ఎస్సీల మద్దతు, ముస్లిం రిజర్వేషన్లు తీసేయడం వల్ల బీజేపీపై మైనార్టీల కోపం.. ఇవన్నీ కలసి కాంగ్రెస్ కి మేలు చేసినట్టు తెలుస్తోంది.

First Published:  10 May 2023 4:41 PM GMT
Next Story