పఠాన్ మూవీ: ఒక వైపు నిరసనలు...మరో వైపు రికార్డు కలెక్షన్లు
హైదరాబాద్, కాచిగూడలో ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ థియేటర్ తో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బీహార్ లోని పాట్మా, భగల్ పూర్ లో రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు.

షారూక్ ఖాన్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించిన పఠాన్ మూవీకి వ్యతిరేకంగా ఒకవైపు రైట్ వింగ్ కార్యకర్తలు థియేటర్లపై దాడులు, పోస్టర్లు చించేయడం, నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటే మరో వైపు ఆ మూవీ రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది.
హైదరాబాద్, కాచిగూడలో ఏషియన్ తారకరామ సినీప్లెక్స్ థియేటర్ తో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. బీహార్ లోని పాట్మా, భగల్ పూర్ లో రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. భగల్ పూర్ లో ఓ థియేటర్ పై దాడి చేసి పోస్టర్లు చించేశారు. థియేటర్ లోపలి కి దూకపోయి మూవీ ప్రదర్శన ఆపకపోతే థియేటర్ ను కాల్చేస్తామని బెదిరించారు. '' ఫిల్మ్ చలేగా హాల్ జలేగా'' అని నినాదాలు చేశారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం అంతటా చిత్రానికి వ్యతిరేకంగా రైట్-వింగ్ గ్రూపులు నిరసనలు చేయడంతో అనేక థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేశారు. ఇండోర్‌తో పాటు భోపాల్, గ్వాలియర్, బర్వానీ తదితర ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇండోర్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో ప్రదర్శనకు అంతరాయం కలిగించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ప్రకారం, వారు థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకులను బలవంతంగా బయటకు పంపారు.
ఇండోర్‌లోని కస్తూరి సినీప్లెక్స్‌లో ‘పఠాన్’ సినిమా ప్రదర్శనను వ్యతిరేకిస్తూ, బజరంగ్ దళ్ నాయకుడు తన్ను శర్మ నాయకత్వంలో జరిగిన ప్రదర్శనలో ఆయన మాట్లాడిన మాటలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. తన్ను శర్మ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్లింలు రోడ్లమీదికి వచ్చారు. తన్ను శర్మతో సహా భజరంగ్ దళ్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు చందన్ నగర్ పోలీస్ స్టేషన్, చత్రిపురా, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
ఒకవైపు పఠాన్ మూవీకి వ్యతిరేకంగా రైట్ వింగ్ కార్యకర్తలు ఆందోళనలకు పాల్పడుతుండగా మూవీ కలెక్షన్లు మాత్రం రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తొలిరోజు నెట్ వసూళ్లు ఇండియాలో రూ.57కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ రూ.67కోట్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.39కోట్లను రాబట్టింది. ఈ మూవీ కలెక్షన్స్ రెండో రోజు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఇండియాలో ఈ సినిమా రెండో రోజు రూ.60కోట్ల నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఈ మూవీ 600 కోట్లకు పైగా రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.