Telugu Global
National

అటు కరోనా భయం.. ఇటు పతంజలి వ్యాపారం

పతంజలి లాంటి వారు ఇందులో వ్యాపార కోణం చూశారు. వెంటనే రంగంలోకి దిగారు, కరోనిల్ కిట్స్ వాడండి అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

అటు కరోనా భయం.. ఇటు పతంజలి వ్యాపారం
X

గతంలో కరోనిల్ అనే పేరుతో ఆయుర్వేద మాత్రల్ని మార్కెట్లోకి తేవాలని చూశారు పతంజలి సహ భాగస్వామి బాబా రామ్ దేవ్. ఆ తర్వాత కోర్టు చీవాట్లు పెట్టింది, కేంద్రానికి మొట్టికాయలేసింది. దీంతో కరోనా పేరు తీసేసి దాన్ని శ్వాసకోశ వ్యాధుల నివారణ మందుగా ప్రచారం చేసుకున్నారు. వ్యాపారం మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ దేశంలో కరోనా భయం మొదలు కావడంతో పతంజలి రంగంలోకి దిగింది. కరోనా, కరోనా దుష్ఫలితాలను జయించండి అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు మొదలు పెట్టింది. పతంజలి ప్రోడక్ట్స్ వాడండి అంటూ ప్రచారం చేస్తోంది.

భయాందోళనలే వారి పెట్టుబడి..

చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ అప్రమత్తత ప్రకటించిన కేంద్రం ఒకరకంగా ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు మొదలు పెడతామంటూ కొంతమంది ప్రకటనలిచ్చారు. మరికొందరు మన ఇమ్యూనిటీ బాగుందన్నారు. పతంజలి లాంటి వారు ఇందులో వ్యాపార కోణం చూశారు. వెంటనే రంగంలోకి దిగారు, కరోనిల్ కిట్స్ వాడండి అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

ప్రభుత్వ పెద్దల సహకారం ఉండబట్టే గతంలో కూడా పతంజలి వ్యాపారం జోరుగా సాగింది. కరోనా పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధమైంది. కానీ కోర్టులు అడ్డుకోవడంతో ఆ పాచిక పారలేదు. తీరా ఇప్పుడు కొత్త వేవ్ అనే మాట బయటకు రావడంతో మళ్లీ బాబా రామ్ దేవ్ రంగంలోకి దిగారు, కరోనిల్ కిట్లు కొనండి కరోనాకి దూరంగా ఉండండి అంటూ ప్రకటనలిస్తున్నారు. కరోనా పేరుతో జరుగుతున్న ఈ వ్యాపారానికి కూడా ప్రభుత్వ పెద్దల మద్దతు ఉంటుందనే అనుకోవాలి.

First Published:  25 Dec 2022 10:16 AM IST
Next Story