Telugu Global
National

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత కేసీఆర్

ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భవనం మొదటి అంతస్తులో అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన చాంబర్‌లో అధినేత కేసీఆర్ ఆసీనులయ్యారు.

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత కేసీఆర్
X

ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటలకు రిబ్బన్ కట్ చేసి బీఆర్ఎస్ భవన్‌ లోపలికి సీఎం కేసీఆర్ ప్రవేశించారు. ప్రారంభోత్సవానికి ముందు నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. భవన్‌లోకి ప్రవేశించిన అనంతరం దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భవనం మొదటి అంతస్తులో అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్‌లో కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మరి కాసేపట్లో అధినేత కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోశ్ కుమార్ పాల్గొన్నారు.

కాగా, ఇకపై బీఆర్ఎస్ జాతీయ వ్యవహారాలన్నీ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఇన్నాళ్లూ సర్దార్ పటేల్ మార్గ్‌లోని తాత్కాలిక భవనం నుంచి పార్టీ వ్యవహారాలు నిర్వహించారు. కానీ ఇకపై వసంత్ విహార్‌లోని బీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యకలాపాలకు వేదిక కానున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా ఈ భవన్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయ విస్తరణకు ఈ భవనం శాశ్వత వేదికగా నిలిచిపోతుందని అన్నారు.

ఢిల్లీలోన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను 11 వేల అడుగుల స్థలంలో నిర్మించారు. నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఈ భవనంలో.. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, నాలుగు ప్రధాన కార్యదర్శులు చాంబర్స్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ చాంబర్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. ఇదే అంతస్తులో ఇతరుల కోసం ఏర్పాటు చేసిన చాంబర్స్ కూడా ఉన్నాయి.

భవనం 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా.. మరో 18 రూములు ఇతరులకు అందుబాటులో ఉంటాయి. ఇకపై ఢిల్లీ వచ్చినప్పుడు హోటల్స్‌లో కాకుండా ఇక్కడే బస చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.





First Published:  4 May 2023 1:50 PM IST
Next Story