నితీష్ కుమార్ పై కుర్చీ విసిరిన గుర్తుతెలియని వ్యక్తి
వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది నితీష్ కుమార్ కు చేతులు అడ్డంపెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిపై కుర్చీ విసిరిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కుర్చీ విసరడం కలకలం రేపింది. చుట్టూ భద్రతా సిబ్బంది, పార్టీ శ్రేణులు ఉన్నప్పటికీ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కుర్చీ విసరడం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలంగా రాష్ట్రంలో సమాధాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, అలాగే ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయా.. లేదా.. అని తెలుసుకునేందుకు నితీష్ కుమార్ ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఔరంగాబాద్ పట్టణంలో సమాధాన్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. యాత్రలో నితీష్ కుమార్ నడుచుకుంటూ వెళుతుండగా ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆయనపైకి విరిగిన కుర్చీ విసిరేశాడు. అయితే అది నితీష్ కుమార్ కు తగల్లేదు. ఆయనకు సమీపంలో పడింది.
వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది నితీష్ కుమార్ కు చేతులు అడ్డంపెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిపై కుర్చీ విసిరిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. చుట్టూ భద్రతా సిబ్బంది, వందల సంఖ్యలో పోలీసులు, పార్టీ శ్రేణులు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై దాడికి ప్రయత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది.