Telugu Global
National

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ముందస్తుపై సోషల్ మీడియాలో రచ్చ

అజెండా ఖరారు కాకపోవడం పక్కనపెడితే, అసలు సెలవ రోజుల్లో సమావేశాలు ఏంటని నిలదీస్తున్నాయి విపక్షాలు. వినాయక చవితి సమయంలో సమావేశాలను నిర్వహించాలనుకోవడంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ముందస్తుపై సోషల్ మీడియాలో రచ్చ
X

ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు మణిపూర్ అల్లర్ల ఆందోళనలతో ముగిశాయి. వివాదాస్పద ఢిల్లీ బిల్లుకి కూడా ఈ సమావేశాల్లోనే ఆమోద ముద్ర పడింది. అయితే ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపరుస్తోంది కేంద్రం. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజలు పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అజెండా ఖరారు కాకపోవడంతో ఇప్పుడీ సమావేశాల వ్యవహారం సస్పెన్స్ గా మారింది.


సోషల్ మీడియాలో రచ్చ..

కేంద్రం ముందస్తుకి వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. సడన్ గా ఈ సమావేశాలు ఎందుకంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. అజెండాపై కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇవి ముందస్తుకి సంకేతాలేనంటూ వాట్సప్ యూనివర్శిటీ తేల్చేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికలు జరిపేందుకే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతోందని, లోక్ సభను రద్దు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

సెలవల్లో సభ ఏంటి..?

అజెండా ఖరారు కాకపోవడం పక్కనపెడితే, అసలు సెలవ రోజుల్లో సమావేశాలు ఏంటని నిలదీస్తున్నాయి విపక్షాలు. వినాయక చవితి సమయంలో సమావేశాలను నిర్వహించాలనుకోవడంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. గణేష్ చతుర్థి సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించడం తమను ఆశ్చర్యానికి గురిచేస్తోందని శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఈ తేదీలను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సమావేశాల తేదీలను మార్చాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కోరారు.

అసలు కారణం అదేనా..?

కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైనా, ఇటీవల సమావేశాలు పాత పార్లమెంట్ లోనే కొనసాగించారు. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు ఈ భవనం మార్పుకోసమేనని అంటున్నారు. ఈ సమావేశాలు పాత పార్లమెంట్ లో మొదలై, కొత్త పార్లమెంట్ భవనంలో ముగుస్తాయని అంటున్నారు. అయితే అధికారిక అజెండా ఖరారైతేనే అసలు విషయం తెలుస్తుంది.

First Published:  31 Aug 2023 8:13 PM IST
Next Story