Telugu Global
National

ఎంపీగా గెలిస్తే వచ్చే జీతం, అలవెన్సులు ఇవే!

త్వరలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలపై ఆసక్తి నెలకొంది. ఈ విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం.

ఎంపీగా గెలిస్తే వచ్చే జీతం, అలవెన్సులు ఇవే!
X

దేశంలో ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 293 సీట్లు సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 232 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. త్వరలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలపై ఆసక్తి నెలకొంది. ఈ విశేషాలేంటో ఒక్కసారి చూద్దాం.

ఎంపీ జీతం - ప్రస్తుతం ఎంపీ నెలకు లక్ష రూపాయలు జీతంగా పొందుతారు. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా 2018లో ఈ జీతాన్ని నిర్ణయించారు.

నియోజకవర్గ అలవెన్స్‌ - ఎంపీలు నెలకు రూ.70 వేలు నియోజకవర్గ అలవెన్స్‌ అందుకుంటారు.

ఆఫీసు ఖర్చులు - ఇక ఆఫీసు ఖర్చుల కోసం రూ. 60 వేలు అదనంగా అందుకుంటారు. వీటిని స్టేషనరీ, టెలీకమ్యూనికేషన్, స్టాఫ్ సాలరీస్‌ కోసం వాడతారు.

రోజువారీ భత్యం - పార్లమెంట్ సమావేశాలు లేదా కమిటీ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో ఎంపీలు ఢిల్లీకి వస్తే.. రోజువారీగా అదనంగా 2000 రూపాయలు భత్యంగా ఇస్తారు.

ప్రయాణ ఖర్చులు - ఎంపీలు వారి కుటుంబసభ్యులకు సంవత్సరానికి 34 సార్లు దేశీయ విమానప్రయాణం ఉచితంగా ఉంటుంది. అధికారిక లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫస్ట్ క్లాస్‌ రైలులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇక ఎంపీలు నియోజకవర్గాల పరిధిలో ప్రయాణించినప్పుడు.. మైలేజ్ అలవెన్స్‌లు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

హౌసింగ్ అండ్ ఆశ్రయం - ఎంపీలకు ఎలాంటి అద్దె లేకుండా ఢిల్లీలోని ప్రైమ్ ఏరియాల్లో 5 ఏళ్ల పాటు ఆశ్రయం కల్పిస్తారు. సీనియారిటీని బట్టి ప్రత్యేకంగా బంగ్లాలు కూడా కేటాయిస్తారు. అధికారికంగా ఇచ్చే ఆశ్రయం వద్దనుకునే వారు హౌసింగ్ అలవెన్స్ కింద నెలకు రూ. 2 లక్షలు పొందవచ్చు.

వైద్య ఖర్చులు - ఎంపీలతో పాటు వారి కుటుంబసభ్యులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌ - CGH కింద ఉచితంగా వైద్యసౌకర్యాలు పొందొచ్చు. ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వ హాస్పిటల్స్‌తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనూ చికిత్స అందిస్తారు.

పెన్షన్ - మాజీ పార్లమెంట్ సభ్యులు ఐదేళ్ల పాటు సభ్యుడిగా ఉంటే నెలకు రూ.25 వేలు పెన్షన్ అందుకుంటారు. తర్వాత అదనంగా పని చేసిన ప్రతి సంవత్సరానికి.. నెలకు రూ. 2 వేలు ఇంక్రిమెంట్‌ అందుకుంటారు.

ఫోన్, ఇంటర్నెట్ - ఎంపీలకు ఏడాదికి లక్షా 50 వేలు కాల్స్ ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉంది. దాంతో పాటు వారికి ఆఫీసు, ఇంట్లో ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా పొందుతారు.

వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ - ఎంపీలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటుంది. ఏడాదికి 50 వేల యూనిట్లు ఉచిత విద్యుత్ వాడుకోవచ్చు. దాంతో పాటు 4 వేల కిలోలీటర్ల నీరు ఉచితంగా పొందవచ్చు.

First Published:  7 Jun 2024 1:45 PM IST
Next Story