Telugu Global
National

ఇంటి నుంచి వెళ్ళిన మా కూతురిని వెతికి పెట్టండి.. - యూపీ సీఎంకు వింత విజ్ఞప్తి

పెళ్లికూతురు క‌నిపించ‌డం లేద‌ని తెలిస్తే తమ పరువు పోతుందని తల్లిదండ్రులు కొందరు బంధువులతో కలిసి ఆమె ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు.

ఇంటి నుంచి వెళ్ళిన మా కూతురిని వెతికి పెట్టండి.. - యూపీ సీఎంకు వింత విజ్ఞప్తి
X

ఇంకొన్ని గంటల్లో పెళ్లి.. వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహ వేదికను చక్కగా ముస్తాబు చేశారు. బంధువుల రాకతో ఇల్లంతా సంద‌డి నెలకొంది. అప్పుడే వధువు ఇంట్లో వారికి ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఫ్రెండ్స్ తో కలసి బ్యూటీ పార్లర్ వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళింది. అంతే ఇక ఇంటికి తిరిగి రాకుండా అట్నుంచి అటే పరారైంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఏరియా సెక్టార్ కు చెందిన ఓ యువతికి కొద్దిరోజుల కిందట పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల 5వ తేదీన ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో వారు కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. బంధువులంతా వచ్చారు. ఇంకొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సమయంలో బ్యూటీ పార్లర్ లో మేకప్ చేయించుకొని వస్తానని చెప్పి వధువు ఫ్రెండ్స్ తో కలసి బయటకు వెళ్ళింది. మేకప్ కోసం వెళ్లిన పెళ్లికూతురు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. సమయం మించి పోతుండడంతో ఫోన్ చేయగా పెళ్లికూతురు లిఫ్ట్ చేయలేదు.

పెళ్లికూతురు క‌నిపించ‌డం లేద‌ని తెలిస్తే తమ పరువు పోతుందని తల్లిదండ్రులు కొందరు బంధువులతో కలిసి ఆమె ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. అయినా వారికి పెళ్లికూతురి జాడ దొరకలేదు. చివరికి అబ్బాయి తరపు వారికి అసలు విషయం తెలిసిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. వధువు కుటుంబ సభ్యులు ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే నాలుగు రోజులు గడిచినా ఆమె ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో వధువు కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. మా కుమార్తె పెళ్లిపీటల నుంచి వెళ్లి నాలుగు రోజులైనా పోలీసులు కనిపెట్టలేకపోయారని.. మీరైనా స్పందించి.. మా కూతురి ఆచూకీని వెతికి పెట్టాలని అమ్మాయి త‌ల్లిదండ్రులు ముఖ్యమంత్రికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మామూలుగా ఇటువంటి వ్యవహారాలను పోలీసులే డీల్ చేస్తారు.. కానీ తమ కుమార్తెను వెతికి పెట్టాలని తల్లిదండ్రులు ఏకంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు.

First Published:  10 May 2023 9:27 AM GMT
Next Story