ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తో ముస్లిం ప్రముఖుల భేటీపై ఓవైసీ అభ్యంతరం
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి సమావేశమవడం, ఆయనను పొగడడంపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ముస్లిం వర్గాలను వేధించే సిద్ధాంతం గలవారిని పొగడడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ముస్లిం మత పెద్దలు కొనియాడడం ఆయనను ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసించడం పట్ల ఎఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారంనాడు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో మోహన్ భగవత్ సమావేశమయ్యారు. అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ.. "మోహన్ భగవత్ మమ్మల్ని కలవడం విశేషం. భగవత్ ఇమామ్ హౌస్‌కి మీటింగ్ కోసం వచ్చారు. ఆయన మన రాష్ట్ర పిత, రాష్ట్ర జ్ఞాని. దేశ ఐక్యత, మనం సమగ్రతను కాపాడుకోవాలి. మనమందరం వేర్వేరు పూజా విధానాలు అనుసరించవచ్చు. కానీ అంతకంటే ముందు మనమందరం మనుషులం. మేము భారతదేశంలో నివసిస్తున్నాము. భారతీయులం, "అని ఆయన అన్నారు.
భారతదేశం విశ్వ గురువుగా అవతరించే దశలో ఉందని, దాని కోసం మనమందరం కృషి చేయాలని ఆయన అన్నారు.ఇల్యాసీ సోదరుడు సుహైబ్ ఇల్యాసీ మాట్లాడుతూ తన తండ్రికి సంఘ్‌తో గతంలో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. "మా నాన్నగారికి సంఘ్‌తో పాత సంబంధం ఉంది. జమీల్ ఇల్యాసి వర్ధంతి రోజున మోహన్ భగవత్ మసీదుకి వచ్చారు, ఇది కుటుంబ కార్యక్రమం. ఆ కోణంలో మాత్రమే చూడాలి," అన్నారాయన.
ఇదిలా ఉండగా, ముస్లిం మత పెద్దలను భగవత్ కలుసుకోవడం, మత పెద్దలు ఆయన్ను పొగిడిన విధానం పై ఎంఐఎం అధినేత ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్‌ను కలిసిన వారు సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వారు. వారికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులతో ( గ్రౌండ్ రియాలిటీతో) సంబంధం లేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లిం వర్గాలను వేధించే సిద్ధాంతం గలవారిని పొగడడం ఏంటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.