Telugu Global
National

కోవిషీల్డ్‌ కాదు.. కోవాక్సిన్‌తోనూ ముప్పే!

కోవాక్సిన్ తీసుకున్న పలువురిలో శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ సమస్యలతో పాటు 5 శాతం మహిళల రుతుక్రమంలో తేడాలు వచ్చినట్లు అధ్యయనం స్పష్టం చేసింది.

కోవిషీల్డ్‌ కాదు.. కోవాక్సిన్‌తోనూ ముప్పే!
X

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌‌ గురించి ఆందోళనలు తొలగకముందే.. దేశీయంగా తయారైన కోవాక్సిన్‌‌‌‌ గురించి షాకింగ్‌ నిజాలు బయటకు వస్తున్నాయి. కోవిషీల్డ్‌ తీసుకున్న వారిలో అరుదుగా రక్తం గడ్డ కట్టే అవకాశాలున్నాయని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా కోవాక్సిన్‌తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కోవాక్సిన్ తీసుకున్న మూడింట ఒక వంతు వారిలో ఏడాది తర్వాత సైడ్‌ ఎఫెక్ట్స్‌ గుర్తించినట్లు అధ్యయనంలో తేలింది.

ఈ మేరకు స్ప్రింగర్‌ ఇంటర్నేషనల్ డ్రగ్‌సేఫ్టీపై అకాడమిక్‌ జర్నల్‌ ప్రచురించింది. కోవాక్సిన్ తీసుకున్న పలువురిలో శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ సమస్యలతో పాటు 5 శాతం మహిళల రుతుక్రమంలో తేడాలు వచ్చినట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ఇందుకోసం కోవాక్సిన్ తీసుకున్న 926 మందిపై పరీక్షలు నిర్వహించారు.

అయితే ఈ వార్తలపై కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్ స్పందించింది. కోవాక్సిన్ అనేక అధ్యయనాల్లో అద్భుతమైన సేఫ్టీ రికార్డును సొంతం చేసుకుందని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. కోవాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇందుకుగానూ ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లాలకు కేంద్ర ప్రభుత్వం 2022లో దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌ను కూడా అందించింది.

మరోవైపు.. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో అరుదుగా రక్తం గడ్డే అవకాశాలున్నాయని ఆస్ట్రాజెనికా సంస్థ ఇటీవల కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ సిండ్రోమ్‌ను థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ - TTS అని పిలుస్తారని తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను‌ ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్‌ తయారు చేసింది. ఇలా వరుసగా కరోనా వ్యాక్సిన్‌లపై వస్తున్న వార్తలతో ప్రజల్లో భ‌యాందోళన నెలకొంది.

First Published:  17 May 2024 5:37 AM GMT
Next Story