Telugu Global
National

యోగీ ప్రభుత్వం.. ఆరేళ్లలో 10,720 ఎన్‌కౌంటర్లు..

యూపీ సీఎంగా యోగీ ఆదిత్యానాథ్ 2017 మార్చి 19న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు.

యోగీ ప్రభుత్వం.. ఆరేళ్లలో 10,720 ఎన్‌కౌంటర్లు..
X

యూపీలో గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్రిమినల్స్ పట్ల కాస్త కఠినంగా ఉంటోంది. సాధువులా కనిపించే సీఎం యోగీ.. తన అసలు క్యారెక్టర్ వేరే అనేలా గత ఆరేళ్లలో ఏకంగా 10,720 ఎన్‌కౌంటర్లు చేయించారు. క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతానని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న సీఎం యోగి.. గత ఆరేళ్లలో రోజుకు సగటున 5 ఎన్‌కౌంటర్ల చొప్పున చేయించడం గమనార్హం. ఈ ఆరేళ్లలో 70 మంది కరుడు గట్టిన క్రిమినల్స్ ఎన్‌కౌంటర్లలో హతం కాగా.. 6 వేల మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీ సీఎంగా యోగీ ఆదిత్యానాథ్ 2017 మార్చి 19న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. యూపీ అంటేనే రౌడీలు, గూండాలు, మాఫియాలకు అడ్డాగా ఉండేది. హత్యలు, మానభంగాలు, దారి దోపిడీలు ఆ రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతుండేవి. రాత్రి అయితే సామాన్య ప్రజానీకమే కాకుండా పోలీసులు కూడా రోడ్లపై తిరగడానికి భయపడేలా యూపీలో పరిస్థితులు ఉండేవి. అయితే యోగీ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రౌడీలు, గూండాల ఏరివేత మొదలైంది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఎన్‌కౌంటర్లు ఆగడం లేదు.

గత ఆరేళ్లలో యూపీలో 10,720 ఎన్‌కౌంటర్లు జరిగాయి. రోజుకు సగటున ఐదు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్‌కౌంటర్ల కారణంగా ఒక పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. 401 మంది పోలీసులు గాయపడ్డారు. యూపీ సీఎం యోగి నుంచి కచ్చితమైన ఆదేశాలు ఉండటంతోనే పోలీసులు ఎన్‌కౌంటర్లు చేయడానికి వెనుకాడటం లేదు.

యూపీలో ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల సంఘాలు గొంతెత్తాయి. సీఎం యోగీ, పోలీసుల తీరుపై మండిపడ్డాయి. అయినా సరే యోగీ మాత్రం తన మాట మీదే నిలబడ్డారు. యోగీ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల క్రైమ్ రేట్ తగ్గింది. కానీ, మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ క్రైమ్ రేటులో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ అగ్రస్థానంలోనే ఉన్నది. ఎన్‌కౌంటర్ల వల్ల క్రైమ్ తగ్గదని ఎన్ని రిపోర్టులు తెలియజేసినా.. యోగీ మాత్రం తన పంథాను మార్చడం లేదు.

First Published:  17 March 2023 12:38 PM GMT
Next Story