Telugu Global
National

మాపార్టీ మతతత్వ పార్టీ... బీజేపీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు... బహిష్కరించిన పార్టీ

తమిళనాడు మంత్రి కారుపై బీజేపీ కార్యకర్తలు చెప్పులు విసరడాన్ని మధురై నగర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ శరవణన్ తీవ్రంగా ఖండించారు. మంత్రికి ఆయన క్షమాపణలు చెప్పారు. అంతే కాదు పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.

మాపార్టీ మతతత్వ పార్టీ... బీజేపీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు... బహిష్కరించిన పార్టీ
X

తమిళనాడు మధురై నగర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ శరవణన్ తన పార్టీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ మతతత్వ పార్టీ అని ఆరోపించారు. ఆయన విమర్శలపై ఆగ్రహించిన‌ పార్టీ ఆయనను పార్టీ నుంచి తొలగించింది. అసలేం జరిగిందంటే...

జ‌మ్మూకశ్మీర్ లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మధురైకి చెందిన రైఫిల్‌మ్యాన్ డి.లక్ష్మణ్ అమరుడయ్యారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు తమిళనాడు మంత్రి త్యాగరాజన్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కూడా అదే కార్యక్రమానికి వస్తున్నారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. అయితే మిలటరీ ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు మాత్రమే హాజరు కావాలని, లేకపోతే ప్రొటోకాల్ ఉల్లంఘించినట్టు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన కారుపై చెప్పులు విసిరారు. ఈ సంఘటన ఆ పార్టీలో వివాదానికి కారణమయ్యింది.

మంత్రి కారుపై తమ కార్యకర్తలు చెప్పులు విసరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మధురై నగర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ శరవణన్ మంత్రి త్యాగరాజన్ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''మా కార్యకర్తలు అదుపు తప్పి అలా ప్రవర్తించడం బాధాకరం. ఆ దాడి నన్ను కలవరపెట్టినందునే త్యాగరాజన్‌ను కలుసుకుని క్షమాపణలు చెప్పాను అలా క్షమాపణ చెప్పడం నాకు చాలా ఉపశమనం కలిగించింది." అన్నారు. పైగా తమ పార్టీ తీవ్ర మతతత్వ పార్టీగా మారిపోయిందని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికైనా పార్టీ మారకపోతే ప్రజలకు దూరమవడం ఖాయం అని ఆయన అన్నారు.

ఈ పరిణామ‍ం బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే శరవణన్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన జారీ చేసింది. శరవణన్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీకి చెడ్డపేరు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఆరోపించారు.

మరో వైపు డాక్టర్ శరవణన్ తన అధ్యక్ష పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. "నాకు బీజేపీ పదవి కంటే మనశ్శాంతి ముఖ్యం. నేను బీజేపీలో కొనసాగను. ఉదయమే నా రాజీనామా లేఖను బీజేపీకి పంపబోతున్నాను.'' అని ఆదివారం చెప్పారు.

First Published:  15 Aug 2022 12:18 PM IST
Next Story