షిండే వర్గ ఎమ్మెల్యేల సేవలో `నిర్భయ` కార్లు.. మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
మహిళల భద్రత కోసం నైట్ పెట్రోలింగ్ వంటి కార్యక్రమాల కోసం కార్లను కొనుగోలు చేసి ఆ వాహనాలను ఎమ్మెల్యేల సేవ కోసం వినియోగిస్తున్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇటీవల విమర్శించారు.
ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం ఘటన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఆమె పేరిట మహిళలకు రక్షణ కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. దిశ ఘటన తరువాత ఏపీలో మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా నిర్భయ పేరుతో పోలీసులు మహిళా రక్షణకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, మహారాష్ట్రలో నిర్భయ నిధులతో కొనుగోలు చేసిన కార్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేల సేవకు ఉపయోగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ లో నిర్భయ నిధులతో 220 కార్లు కొనుగోలు చేసింది. అయితే ఈ కార్లలో 47 వాహనాలను షిండే వర్గ ఎమ్మెల్యేల రక్షణ కోసం ప్రభుత్వం కేటాయించింది. వాటిల్లో 17 కార్లను వాటికి కేటాయించిన ఆయా పోలీస్ స్టేషన్లకు పంపింది. 30 వాహనాలు మాత్రం షిండే వర్గ ఎమ్మెల్యేల కాన్వాయ్ ల కోసం ఉపయోగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహిళల భద్రత కోసం నైట్ పెట్రోలింగ్ వంటి కార్యక్రమాల కోసం కార్లను కొనుగోలు చేసి ఆ వాహనాలను ఎమ్మెల్యేల సేవ కోసం వినియోగిస్తున్నారని మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇటీవల విమర్శించారు. ఆ వాహనాలను కేటాయించిన ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించకపోతే తాము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేల రక్షణ కోసం పంపిన ఆ 30 కార్లను తిరిగి వాటిని కేటాయించిన ఆయా పోలీస్ స్టేషన్లకు పంపే కార్యక్రమం ప్రారంభించింది.