విపక్షాల నిరసనలతో దద్దరిల్లిన పార్లమెంట్..
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు.
పార్లమెంట్ ఉభయసభలు విపక్షాల నిరసనలతో దద్దరిల్లాయి. ఈడీ, సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టగా.. అదానీ స్కామ్ పై జాయింట్ పార్లమెంట్ కమిటీతో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మొత్తంగా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభించాయి.
కేంద్రంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన.
— BRS Party (@BRSparty) March 13, 2023
1/3 pic.twitter.com/HGqCx7xw13
వాయిదా తీర్మానం..
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ ముందున్న గాంధీ విగ్రహం కూడా నిరసన చేపట్టారు. విపక్షాలతో కలసి బీఆర్ఎస్ ఎంపీలు కూడా అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
అటు అదానీ వ్యవహారం, ఇటు దర్యాప్తు సంస్థలతో చేయిస్తున్న ప్రతీకార దాడులపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఈ రెండు విషయాల్లో కూడా కేంద్రం కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతోంది. అదానీతో తమకేం సంబంధం లేదని చెబుతున్నా.. ఎల్ఐసీ వంటి సంస్థలు అదానీ గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టడంపై విపక్షాలు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడుల్లో 90శాతం విపక్షాలే టార్గెట్ కావడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఈ రెండు విషయాలతో ప్రస్తుతం కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది.