అభివృద్ధి కావాలంటే సినిమాలు చూపిస్తారా..?
తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు, తమ చేతగాని తనాన్ని హడావిడి చేసి కవర్ చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది కేంద్రం. కాశ్మీర్ లో సినిమా హాళ్లు ప్రారంభించాం.. ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది.
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బీజేపీ నేతలకు మహా సరదా. ఇప్పటి వరకూ అదే చేశారు, ఇకపై కూడా అదే చేస్తారు. అంతకు మించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం, సమస్యల సుడిగుండాల నుంచి బయటపడేయటం వారికి చేతకాదు, చేయాలని లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ దశ, దిశ మారిపోతుందని డబ్బాలు కొట్టింది కేంద్రం. కానీ అక్కడ పండిట్లపై మారణకాండ ఆగలేదు. ఆ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు, తమ చేతగాని తనాన్ని హడావిడి చేసి కవర్ చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. కాశ్మీర్ లో సినిమా హాళ్లు ప్రారంభించాం.. ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది కేంద్రం.
1990 తర్వాత కాశ్మీర్ లో తీవ్రవాదం భయంతో సినిమాహాళ్లు మూతబడ్డాయి. తీవ్రవాద సంస్థలనుంచి బెదిరింపు కాల్స్ రావడంతో సినిమాహాళ్లను మూసివేశారు యజమానులు. 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ధైర్యం చేసి ఓ సినిమా హాల్ ని తిరిగి ప్రారంభించారు. అదే రోజు గ్రెనేడ్ దాడి జరగడంతో మిగతావారు కూడా భయపడ్డారు. ఆ తర్వాత కాశ్మీర్ లోని సినిమా హాళ్లు షాపింగ్ కాంప్లెక్సులు, నర్సింగ్ హోమ్ లుగా మారిపోయాయి. ఇప్పుడీ పరిస్థితి మారిపోతోందని అంటున్నారు బీజేపీ నేతలు. అది తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.
దక్షిణ కాశ్మీర్ లోని షోఫియాన్, పుల్వామా జిల్లాల్లో రెండు సినిమా హాళ్లను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కాశ్మీర్ చరిత్రలోనే ఇది చరిత్రాత్మక రోజు అని అన్నారాయన. ఇక్కడి యువత చాలా ఏళ్లుగా సినిమా హాళ్ల కోసం ఎదురుచూస్తోందని, ఆ కల ఇన్నాళ్లకు నెరవేరిందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటి శ్రీనగర్ లో మొదటి మల్టీప్లెక్సును ప్రారంభిస్తామన్నారు.
సినిమాహాళ్లు ఎందుకు..?
కాశ్మీర్ లో తీవ్రవాదంతో సినిమాహాళ్లు మూతపడ్డాయేమో కానీ, దేశవ్యాప్తంగా కరోనా తర్వాత చాలావరకు థియేటర్లు ఫంక్షన్ హాళ్లుగా మారిపోయాయి. ఓటీటీ ప్రభావం కూడా తోడవడం, టికెట్ రేట్లు భారీగా పెరగడంతో సామాన్యులు సినిమా హాళ్లకు వెళ్లే అవకాశం బాగా తగ్గిపోయింది. ఈ దశలో ఇప్పుడు కాశ్మీర్ లో సినిమాహాళ్ల పునఃప్రారంభం అనేది కేవలం ప్రచార ఆర్భాటమేనంటున్నాయి ప్రతిపక్షాలు. కాశ్మీర్ కి కావాల్సింది సినిమా హాళ్లు కాదని అభివృద్ధి అని నిలదీస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కేంద్రం సాధించిందేమీ లేదని, పరిస్థితుల్లో మార్పులు లేవని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న కేంద్రం, ఫలితం లేకపోవడంతో ఇప్పుడిలా సినిమాహాళ్ల ప్రారంభం అంటూ హడావిడి చేస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.