న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం: పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కార్యాలయ ఆవరణలో నిన్నటి నుంచి రాజశ్యామల యాగం, చండీ హోమం నిర్వహించారు. ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమంలో కెసిఆర్ దంపతులతో పాటు పలువురు నాయకులు పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ముహుర్తం ప్రకారం పతాకావిష్కరణ, కార్యాలయ ప్రారంభించారు కెసిఆర్.
దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలుకుతూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశఖరరావు (కెసిఆర్) బుధవారంనాడు న్యూఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తన చాంబర్ లో కేసీఆర్ ఆసీనులయ్యారు. అనంతరం తన చాంబర్ లో పార్టీ నియామాకాలపై కేసీఆర్ సంతకం చేసి ఆ పత్రాలను కేసీఆర్ ఆయా రాష్ట్రాల నేతలకు అందించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కార్యాలయ ఆవరణలో నిన్నటి నుంచి రాజశ్యామల యాగం, చండీ హోమం నిర్వహించారు. ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమంలో కెసిఆర్ దంపతులతో పాటు పలువురు నాయకులు పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ముహుర్తం ప్రకారం పతాకావిష్కరణ, కార్యాలయ ప్రారంభించారు కెసిఆర్.
ఈ కార్యక్రమంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ తిరుమావలవన్ డాక్టర్ తోల్ కప్పియన్ , పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలని కెసిఆర్ ఆకాంక్షించారు. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతాంగ సంక్షేమం కోసం, దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం రాజకీయ విధానాలలో మార్పులు తీసుకు వచ్చేందుకు ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.