ఓ ట్రాన్స్ జెండర్ బహిరంగ లేఖ !
భారతదేశపు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లప్పుడూ వివిధ రకాల ప్రేమ, వివిధ రకాల వివాహాలకు చోటు కల్పించాయి. శతాబ్దాల నాటి మన సంప్రదాయాల్లో, మానవ కుటుంబాల్లో స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, ఇంటర్‌సెక్స్ వ్యక్తులు, లెస్బియన్లు, లింగమార్పిడిదారులు ఉన్నారు.
స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో ప్రసంగించిన నేపథ్యంలో లింగమార్పిడి, లైంగిక మైనారిటీల హక్కుల కార్యకర్త అక్కై పద్మశాలి రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం...
ప్రియమైన సర్,
స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వకూడదని రాజ్యసభలో హెచ్చరించిన మీ ప్రసంగాన్ని చూసి నేను చాలా కలత చెందాను. లెస్బియన్, గే ,బైసెక్సువల్, లింగమార్పిడి, ఇంటర్‌సెక్స్ ఉద్యమంలో భాగమైన, లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తిగా, వివాహం చేసుకునే హక్కు పురుషులు, స్త్రీలకు మాత్రమే పరిమితం కాకుండా అందరికీ వర్తించాలని నేను నమ్ముతున్నాను.
మీరు "స్వలింగ వివాహాన్ని" వ్యతిరేకిస్తున్నారు, మీ అభిప్రాయం ప్రకారం వివాహం బయాలాజికల్ పురుషుడు, బయాలాజికల్ స్త్రీ మధ్యనే జరగాలి . అయితే LGBTQI (Lesbian, Gay, Bisexual, Transgender, Queer, Intersex, and Asexual people collectively)ఈ అంశం మీదనే ఉద్యమం చేస్తున్నది. నా వ్యక్తిగత ఉదాహరణను తీసుకుంటే, నేను మగవాడిగా పుట్టాను, అయినప్పటికీ నేను శారీరకంగా, మానసికంగా స్త్రీని . దాని పట్ల నాకు అవగాహన పెరగడంతో నేను ఇప్పుడు స్త్రీగా మారాను. అయితే మీ నిర్వచనం ప్రకారం, నేను బయాలాజికల్ స్త్రీని కాను, అందుకే పెళ్లి చేసుకునే అర్హత లేదు.
జీవశాస్త్రపరంగా స్త్రీలు కాని మాలాంటి వారికి వివాహాన్ని నిరాకరించడం సమానత్వ సూత్రాన్ని, గౌరవప్రదంగా జీవించే హక్కును తిరస్కరించడమే.
నేనే కాదు బయాలాజికల్ స్త్రీ లేదా బయోలాజికల్ పురుషులు కాని వారు చాలా మంది ఉన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని మీరు అనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. భారతదేశపు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లప్పుడూ వివిధ రకాల ప్రేమ, వివిధ రకాల వివాహాలకు చోటు కల్పించాయి. శతాబ్దాల నాటి మన సంప్రదాయాల్లో, మానవ కుటుంబాల్లో స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, ఇంటర్‌సెక్స్ వ్యక్తులు, లెస్బియన్లు, లింగమార్పిడిదారులు ఉన్నారు.
మీ ప్రసంగంలో ఈ దేశం యొక్క సాంస్కృతిక తత్వానికి, సంస్కృతికి , ఆలోచనలకు విరుద్ధమైన తీర్పు ఇవ్వవద్దని మీరు కోర్టుకు సలహా ఇవ్వడం చూసి నేను ఆశ్చర్యపోయాను. నా దృష్టిలో, కోర్టులు రాజ్యాంగం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయి కానీ సాంస్కృతిక నీతి ఆధారంగా నిర్ణయం తీసుకోవు. న్యాయమూర్తులు విధిగా పాటించాల్సింది రాజ్యాంగ నైతికత.
రాజ్యాంగ నైతికతను కాపాడటం న్యాయస్థానాల బాధ్యత. సుప్రీం కోర్ట్ సాంస్కృతిక నీతి మీద ఆధార పడి కాకుండా రాజ్యాంగం ఆధారంగా ఈ విషయాన్ని నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కోర్టు భారతదేశంలోని LGBTQI పౌరుల సమానత్వం, గౌరవానికి సంబంధించిన హక్కును పరిరక్షిస్తుంది.
ఇది లెఫ్టిస్టులు, ఉదారవాదులు స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు తీసుకురావడానికి చేస్తున్న యుద్దంగా భావించడం తప్పు. భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో నేను ఒక భాగమని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అందరికీ పెళ్లి చేసుకునే హక్కు కోసం నేను పోరాడుతున్నాను. తద్వారా ప్రజలందరికీ సమానత్వం, గౌరవం లభించాలని నేను కోరుకుంటున్నాను.
మీ వ్యాఖ్యల ద్వారా మీరు మాకు కలిగించిన బాధకు LGBTQI కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.
మీ భవదీయుడు
అక్కై పద్మశాలి
లింగమార్పిడి, లైంగిక మైనారిటీల హక్కుల కార్యకర్త