Telugu Global
National

ఆన్ లైన్ రమ్మీ నాలెడ్జ్ గేమ్..శరత్ కుమార్ వ్యాఖ్యలపై విమర్శలు

రమ్మీ ఒక నాలెడ్జ్ గేమ్ అని వ్యాఖ్యానించారు. అయినా తాను ఒక పార్టీ పెట్టి నిజాయితీగా ఓటు వేయాలని కోరితే వేయని ప్రజలు.. తాను చెప్పానని ఆన్ లైన్ రమ్మీ ఆడతారా..? అంటూ ప్రశ్నించాడు.

ఆన్ లైన్ రమ్మీ నాలెడ్జ్ గేమ్..శరత్ కుమార్ వ్యాఖ్యలపై విమర్శలు
X

ఆన్ లైన్ రమ్మీ నాలెడ్జ్ గేమ్ అని సమతువ మక్కల్ కట్చి అధినేత, తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆన్ లైన్ రమ్మీకి బానిసలుగా మారి ఎంతోమంది యువత ప్రాణాలు వదులుతుంటే అది ఒక నాలెడ్జ్ గేమ్‌గా ఆయ‌న అభివ‌ర్ణించ‌డంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆన్ లైన్ రమ్మీకి బానిసలుగా మారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారుతోంది. రమ్మీ ఆడేందుకు అప్పులు చేసి ఆ తర్వాత ఉన్నదంతా పోగొట్టుకొని కొంతమంది అప్పలపాలవుతుంటే, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా తమిళనాడులో ఆన్ లైన్ రమ్మీ కి బానిసగా మారి ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఆన్ లైన్ రమ్మీని నిషేధించేందుకు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు చేసి దానిని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఆయన తీరుపై తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా సీనియర్ నటుడు శరత్ కుమార్ ఆన్ లైన్ రమ్మీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆన్ లైన్ రమ్మీపై ఆయన చేసిన ప్రకటనను ఆన్ లైన్ రమ్మీ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. దీనిపై శరత్ కుమార్ పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆన్ లైన్ రమ్మీ కి బానిసలుగా మారి యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే .. ఆన్ లైన్ రమ్మీ ఆడాలని శరత్ కుమార్ ప్రకటనల్లో నటించడం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు.

తాజాగా ఇదే విషయమై శరత్ కుమార్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. రమ్మీ ఒక నాలెడ్జ్ గేమ్ అని వ్యాఖ్యానించారు. అయినా తాను ఒక పార్టీ పెట్టి నిజాయితీగా ఓటు వేయాలని కోరితే వేయని ప్రజలు.. తాను చెప్పానని ఆన్ లైన్ రమ్మీ ఆడతారా..? అంటూ ప్రశ్నించాడు. ఆన్ లైన్ రమ్మీని నిషేధిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందటే ఒక బిల్లు తీసుకొచ్చిందని, తాను ఆన్ లైన్ రమ్మీ యాడ్ రెండేళ్ల కిందట చేయగా.. ఆ సంస్థ నిర్వాహకులు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారని అన్నారు.

ఆన్ లైన్ రమ్మీ ఆడితే మేధస్సు పెరుగుతుందని శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉంటూ ఆన్‌లైన్ రమ్మీ ఆడటం తప్పు కాదన్నట్లు శరత్ కుమార్ వ్యాఖ్యానించడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

First Published:  14 Dec 2022 2:05 PM IST
Next Story