Telugu Global
National

పనిచేసే సంస్థకే కన్నం.. జొమాటో డెలివరీబాయ్స్ మోసం

డెలివరీ బాయ్ కి 300 రూపాయలు మిగులుతుంది. మిగతా 700 కస్టమర్ కి లాభం. టోటల్ గా జొమాటోకి వెయ్యి రూపాయలు నష్టం.

పనిచేసే సంస్థకే కన్నం.. జొమాటో డెలివరీబాయ్స్ మోసం
X

జొమాటోలో ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తే డెలివరీ బాయ్ కి కమీషన్ వస్తుంది, కస్టమర్ మంచోడయితే పదో ఇరవయ్యో అదనంగా ముడుతుంది. కానీ పనిచేసే సంస్థనే మోసం చేస్తే అంతకంటే ఎక్కువ సంపాదించొచ్చు. ఇలాంటి ఐడియాతో కొంతమంది డెలివరీ బాయ్స్ జొమాటో సంస్థని దారుణంగా మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని ఓ కస్టమర్ లింక్డిన్ సైట్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో ఆ తప్పు సరిదిద్దుకుంటామని తెలిపారు.

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ముదిరిపోయారు, కొందరు తెలివిమీరారు. డెలివరీ చేస్తే వచ్చే సొమ్ముకంటే పదింతలు సంపాదించడం ఎలాగో తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా దాన్ని అమలులో పెట్టారు. కస్టమర్లు కూడా వారి మోసంలో భాగస్వాములు కావడంతో ఈ వ్యవహారం బయటపడలేదు. కానీ ఓ కస్టమర్ జొమాటో కోణం నుంచి కూడా ఆలోచించాడు. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఆ సంస్థకు నష్టం వస్తే, అసలు ఈ ఉద్యోగాలు ఎగిరిపోతాయి కదా అని భావించాడు. ఆ మోసాన్ని బయటపెట్టాడు.

మోసం ఎలాగంటే..?

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వినయ్ అనే వ్యక్తికి డెలివరీ తీసుకొచ్చిన జొమాటో ఉద్యోగి, ఇంకోసారి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ముందుగానే పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టాలని సూచించాడు. వెయ్యి రూపాయలకు ఫుడ్ ఆర్డర్ ఇస్తే, తనకు కేవలం 300 రూపాయలు ఇస్తే చాలన్నాడు. ఇదెలా సాధ్యం అని అడిగితే.. అసలు సంగతి వివరించాడు. ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత, అది నచ్చకపోతే కస్టమర్లు కొన్నిసార్లు పేమెంట్ ఇవ్వరు.


ఆ నష్టాన్ని జొమాటో భరిస్తుంది. అయిత ఫుడ్ మాత్రం డెలివరీ అయినట్టు చూపిస్తారు. కస్టమర్ కి ఫుడ్ నచ్చలేదంటూ డబ్బులివ్వలేదని డెలివరీ బాయ్ రిపోర్ట్ రాసిస్తాడు. తాను కూడా అలాగే చేస్తానని వినయ్ కి వివరించాడు డెలివరీ బాయ్. అంటే వెయ్యిరూపాయల ఫుడ్ కస్టమర్ కి ఇచ్చేస్తారు. డెలివరీ బాయ్ కి 300 రూపాయలు మిగులుతుంది. మిగతా 700 కస్టమర్ కి లాభం. టోటల్ గా జొమాటోకి వెయ్యి రూపాయలు నష్టం.


ఇలా ఈ తంతు చాలా కాలంగా జరుగుతున్నా కంపెనీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని తేలడంతో ఇప్పుడు దీనిపై నిఘా పెడతామంటోంది యాజమాన్యం. లింక్డిన్ లో వినయ్ పెట్టిన పోస్ట్ పై జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ స్పందించారు. ఇలాంటి లూప్ హోల్స్ ని సరిదిద్దుతామని చెప్పాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  23 Jan 2023 10:29 AM IST
Next Story