Telugu Global
National

విమోచన కాదు విలీనమే!

రాజకీయ లబ్ది కోసం విమోచనోత్సవాల పేరిట విభజన రాజకీయాలకు తెరదీసే కుటిల వ్యూహాల్ని ఆమోదించరు. గంగాజమున తెహజీబ్‌ సంస్కృతిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. కనుకనే విలీన సందర్భాన్ని సమైక్యత, సమగ్రతలని ప్రతిబింబించే ఉత్సవాలుగా జరపాలన్నది తెలంగాణ పాలకుల నిర్ణయం.

విమోచన కాదు విలీనమే!
X

హైదరాబాద్‌ కేంద్రంగా దక్షిణాదిన పట్టు సాధించేందుకు బీజేపీ సకల ప్రయత్నాల్ని చేస్తుంది. అందులో భాగంగానే సెప్టెంబర్‌ 17వ తేదీన హైదరాబాద్‌ విమోచనోత్సవాల పేరుతో తెలంగాణలో విస్తరించే వ్యూహాన్ని అమలు చేస్తుంది. పార్టీ బలం పెంచుకోవ‌డం కోసం చేసే ప్రయత్నం తప్పు కాదు. కానీ చరిత్రని వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి పాల్పడటం క్షంతవ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు కూడా సెప్టెంబర్‌ 17ని ఒక ఉత్సవంగా జరిపే ఆనవాయితీ లేదు. చరిత్ర క్రమంలో అది ఒక తేదీ మాత్రమే. 17 సెప్టెంబర్‌ 1948న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో విలీనమైంది. ఈ విలీనం కోసం ప్రత్యేకించి సంస్థానం ప్రజలు పోరాడలేదు. కానీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్‌ సంస్థానం కూడా భారత్‌లో అంతర్భాగం కావాలని ఆశించారు. ఇక్కడ పత్రికలు ఈ కోణంలోనే సంపాదకీయాలు రాశాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడం తప్ప నిజాం రాజుకు మరో మార్గం లేదని ప్రముఖ పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ సైతం 'ఇమ్రోజ్‌' పత్రికలో పరంపరగా వ్యాసాలు రాశారు.

విలీన ప్రతిపాదనకు పూర్వం..

15 ఆగస్టు 1947న భారతదేశం బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తమై స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. దీనికి ముందుగానే దేశంలోని అనేక సంస్థానాలు, స్వదేశీరాజుల అధీనంలోని ప్రాంతాలు భారత్‌లో విలీనమవుతూ వచ్చాయి. అయితే భారత్‌లో అతి పెద్ద రాజ్యంగా ఉన్న హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేయడానికి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సిద్ధంగా లేడు. చర్చలతో తప్ప బలవంతంగా విలీనం చేయడమనే ప్రక్రియని బ్రిటన్‌ వ్యతిరేకించింది. ఆనాడు ఉన్న పరిస్థితులలో స్థానిక పాలకుల, ప్రజల ఆమోదంతోనే ఇండియన్‌ యూనియన్‌లో విలీనం జరగాలి. కానీ అటు పాకిస్థాన్‌లో, ఇండియాలోనూ కలవకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని, తన సార్వభౌమాధికారం కొనసాగాలని నిజాం నవాబు భావించాడు. ఇందుకు అనువుగానే విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలకు దూరంగా ఉంటూ తన సంస్థానాన్ని ప్రత్యేకంగా చూడాలనే డిమాండ్‌తో వ్యవహరిస్తూ వచ్చాడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.

కానీ విలీనం అనివార్యమైన ప్రక్రియ అని నాటి భారత్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ ప్రతినిధులు నిజాంకు స్పష్టం చేస్తూ విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు కొనసాగించారు. 15 ఆగస్టు 1947 నాటికి చర్చల పర్వం పూర్తి కానందున ఆ తేదీ నాటికి ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ అంతర్భాగం కాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా అటు బ్రిటిష్‌ ప్రతినిధులు, ఇటు భారత ప్రభుత్వ ప్రతినిధులు నిజాం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. దాని ఫలితంగా 29 నవంబర్‌ 1947న భారత ప్రభుత్వానికీ, నిజాం ప్రభుత్వానికీ నడుమ యథాతథ ఒప్పందం కుదిరింది.

దీని ప్రకారం హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో అంతర్భాగం కాబోదు, అలాగే భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం వస్తే హైదరాబాద్‌ తటస్థంగా ఉంటుంది. ఈ ఒప్పందం ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఈ కాలాన‌ హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం ప్రభుత్వం కొనసాగుతుంది. ఇదే స‌మ‌యాన భారత్‌లో విలీనానికి సంబంధించిన చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ ఒప్పందం సాధించిన ప్రత్యేకమైన ఫలితం ఏమంటే హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో విలీనమనే అంశాన్ని తుడిచి పెట్టిందని ఆనాటి హోం మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేసిన వి.పి. మీనన్‌ చెబుతారు. 15 ఆగస్టు 1947 నుంచి 17 సెప్టెంబర్‌ 1948 వరకు విలీనానికి సంబంధించి హైదరాబాద్‌, భారత్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల క్రమాన్ని మీనన్‌ 'ద స్టోరీ ఆఫ్‌ ది ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌' అనే గ్రంథంలో వివరించారు.

విలీనం అనివార్యం

నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ అసఫ్‌ జాహీలలో ఏడవ రాజు. ఆయన 29 ఆగస్టు 1911న అధికారానికి వచ్చాడు. మూడున్నర దశాబ్దాలకు పైగా రాజుగా ఉన్న ఆయనకు అధికారం కోల్పోవడం ఇష్టం లేదు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక కూడా హైదరాబాద్‌ స్వతంత్ర రాజ్యంగా కొనసాగితే బాగుండని తలపోశాడు. తన ఆకాంక్షలు నెరవేరడం సులువు కాదని క్రమంగా అర్థమవుతూ వచ్చింది. నిజానికి ఆయన హయంలోనే హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య ఆకాంక్షలు మొగ్గ తొడిగాయి. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీలు ఉద్యమపథంలో పురోగమించాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలు, మేధావులు సమీకృతమవుతూ వచ్చారు. మరో వైపున 1946 నాటికి తెలంగాణ గ్రామాలలో కమ్యూనిస్టులు సాయుధదళాలతో దొరలని, నిజాం సైన్యాలను, రజాకార్లని ప్రతిఘటిస్తూ వచ్చారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని అణచివేయలేని నిస్సహాయ స్థితిలోకి నిజాం నెట్టబడ్డాడు. ఆయుధాగారం బలహీనపడింది. కమ్యూనిస్టుల సాయుధ దళాల ప్రతిఘటనతో నిజాం ప్రభుత్వ సైన్యాలు గ్రామాల్లోకి అడుగుపెట్టలేని పరిస్థితులు 1948 నాటికి ఏర్పడ్డాయి. హైదరాబాద్‌ సంస్థానంలోని ఈ పరిస్థితుల్ని కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం గమనిస్తూ వచ్చింది.

ఈ వాస్తవాల ఎరుక ఉన్నప్పటికీ స్వతంత్రంగా ఉండాలన్న ఆకాంక్ష నిజాం ప్రభువులో ఉంది. ఇందుకోసం జిన్నా సహాయం తీసుకోవ‌డం కోసం నిజాం ప్రతినిధులు రాయబారం నడిపారు. జిన్నా ఆకస్మిక మరణంతో వాస్తవిక స్థితిని గుర్తించక తప్పని స్థితిలోకి నెట్టబడ్డాడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. ఈ క్రమాన భారత ప్రభుత్వం ఒత్తిళ్ళకు తలొగ్గక తప్పలేదు ఆయనకు. ఆపరేషన్‌ పోలో పేరిట జరిపిన భారత్‌ సైనిక చర్యకు నిజాం ప్రభువు తలొగ్గారు. 17 సెప్టెంబర్‌ 1948న లొంగుబాటుకు అంగీకరించడంతో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.

ప్రజల పాత్ర

నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ప్రజలు మూడు దశాబ్దాలుగా పోరాడుతూ వచ్చారు. నిజాం పాలకుల అమానుషమైన దోపిడీ పీడల్నించి విముక్తం కావాలని సంఘటితమై ఉద్యమించారు. నిజాం పాలన నుంచి విముక్తి కావాలని జనం కోరుకున్నది వాస్తవం. అయితే హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం ద్వారా తమకు విముక్తి లభిస్తుందని ప్రత్యేకంగా ఆశించలేదు. కానీ విశాలమైన భారతదేశంలో భాగం కావాలన్న ఆకాంక్ష మాత్రం ప్రజల్లో ఉంది. హైదరాబాద్‌లో బాధ్యతాయుతమైన, ప్రజాస్వామికమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారు. అందుకోసమే నిజాం ప్రభుత్వ నియంతృత్వ పోకడల్ని ప్రతిఘటించారు.

విలీనమే గాని విముక్తి ఎక్కడ?

ఆపరేషన్‌ పోలో కారణంగా హైదరాబాద్‌ సంస్థానం విలీనమైందే తప్ప ప్రజలకు విముక్తి లభించలేదు. గ్రామాలలోకి ప్రవేశించిన నెహ్రూ సైన్యాలు కమ్యూనిస్టుల్ని ఏరివేసే పేరిట ప్రజలపై చేసిన దారుణాలకు అంతులేదు. నెహ్రూ సైన్యాల అండతో దొరలు తిరిగి గ్రామాలలోకి ప్రవేశించారు. ఈ వాస్తవాలను దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి నవలలు ప్రస్ఫుటంగా చిత్రించాయి. ఆనాటి పరిస్థితిని గురించి రాసిన వి.పి.మీనన్‌ ఒక మాటంటారు` ''హైదరాబాద్‌ రాష్ట్ర చిత్రపటాన్ని చూస్తే ద్వీపకల్పానికి దక్షిణభాగంలో మధ్యలో ఉంటుంది. ఒకవేళ నిజాం ప్రయత్నాలు ఫలించినా, కమ్యూనిస్టులు విజయం సాధించినా ఉత్తరాది నుండి దక్షిణాది వేరయే ప్రమాదం ఉండేది''. ఈ మాటని బట్టి నిజాం అనుకున్నట్టు హైదరాబాద్‌ స్వతంత్ర రాజ్యంగా ఉన్నా, లేదా నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు విజయం సాధించినా తమకు ముప్పు అని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం భావించినట్టు స్పష్టమవుతుంది. కనుకనే ఒకవైపున నిజాం ప్రభువును లొంగదీసుకోవడంతో పాటు మరోవైపున కమ్యూనిస్టుల అణచివేతను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ పోలో నిర్వహించారన్నది వాస్తవం. ఈ పూర్వరంగంలోనే ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ విలీనాన్ని ఎలా చూడాలన్న స్పష్టత కమ్యూనిస్టులకు ఉండాలి. అలాగే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి విముక్తి లభించలేదన్న నిజాన్ని గమనించాలి.

పటేల్‌ ఘనత ఏమిటి?

విలీన ప్రక్రియకు సంబంధించి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు ప్రత్యేకతని ఆపాదిస్తున్నారు. ఆయన కృషి వల్లనే విలీనం సాధ్యమైందని చెబుతున్నారు. నెహ్రూ పాత్ర లేకుండా పటేల్‌ సాధించిన ఘనతగా చెబుతున్నారు. వాస్తవాలు ఇందుకు భిన్నమైనవి. నాటి నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రిగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సంస్థానాల విలీన ప్రక్రియలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌ సంస్థాన విలీనంలో ఒక మంత్రిగా తన బాధ్యతని తాను నిర్వర్తించారు. అయితే ఏ నిర్ణయమైనా ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ మంత్రివర్గం సమష్టి నిర్ణయాలతోనే అమలయింది. నెహ్రూకు తెలియకుండా, ఆయన పాత్ర లేకుండా ఏదీ ముందుకు సాగలేదు. ఇది చారిత్రక వాస్తవం.

విలీనం ఓ లాంఛన ప్రక్రియ

దేశానికి స్వాతంత్య్రం ప్రకటించే ఆగస్టు 17 నాటికి దేశంలోని అనేక సంస్థానాలు భారత్‌లో అంతర్భాగమయ్యాయి. హైదరాబాద్‌ సంస్థాన విలీనం ఏడాది పాటు ఆలస్యమైంది. సాంకేతికంగా భారత్‌లో భాగం కావడానికి పట్టిన సమయమిది. అందుకని విలీనమనేది లాంఛనంగా జరిగిన ఒక ప్రక్రియ. అప్పటికే నిజాం ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కనుక విలీనానికి ఇక్కడి ప్రజల ఆమోదం లభించింది. అందువల్ల హైదరాబాద్‌ సంస్థానం విమోచనం అనే మాట అర్థరహితం. ఎవరి నుంచి ఎవరికి విమోచన లభించింది? భారత ప్రభుత్వాన్ని ప్రతిఘటించే శక్తి నాటి నిజాం ప్రభువుకు లేదు. అంత ఆర్థిక వనరులు, సైన్యం నిజాం దగ్గర లేవు. అంతర్గతంగా కమ్యూనిస్టుల దళాలను ఎదుర్కొడానికి పోలీసులకే ఆయుధాల్ని సమకూర్చలేని బలహీన స్థితిలో నాటి నిజాం ప్రభుత్వం ఉన్నది. ఈ చారిత్రక వాస్తవాల నేపథ్యంలో నిజాం చివరి ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ గౌరవప్రదంగా తప్పుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు.

నెహ్రూ ప్రభుత్వం కూడా నిజాం ప్రభువు గౌరవానికి భంగం కలగకుండానే వ్యవహరించింది. నిజాం వ్యక్తిగత ఆస్తుల్ని ముట్టుకోలేదు. అలాగే ఆయనను రాజ్‌ప్రముఖ్‌గా గుర్తించి గౌరవించింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యే వరకు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ స్టేట్‌ రాజ్‌ప్రముఖ్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక తనంతట తాను ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ అసలు చరిత్రని మరుగున పరచి నిజాం ప్రభువును విలన్‌గా, శత్రువుగా చిత్రీకరించి, ఆయన నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తమైందనే మాట వక్రీకరణలతో కూడిన దుష్ప్రచారమే.

రెండు శతాబ్దాల పైబడి దోచుకొన్న బ్రిటిష్‌ పాలన నుంచి ఆగస్టు 15, 1947న భారతదేశం విముక్తమైంది. కనుక ఆగస్టు 15వ తేదీకి అంతటి ప్రాధాన్యం ఉన్నది. ఇలాంటి ప్రాధాన్యం సెప్టెంబర్‌ 17వ తేదీకి ఉండే అవకాశం లేదు. ఆ రోజున హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది. అందుకని విముక్తి, విమోచన వంటి మాటలకు ఇక్కడ ఆస్కారం లేదు. పాలకుడు ముస్లిం అయినప్పటికీ ముస్లిం కనుక ప్రజలు వ్యతిరేకించలేదు. (కుతుబ్‌షాహీల‌ను, అస‌ఫ్‌జాహీల‌ను బ్రిటిష్ వారిలా ప‌రాయి దేశ‌స్థులుగా చూడ‌లేదు. ఈ నేల మీద‌, ఇక్క‌డి జ‌నాల‌లో క‌లిసి పోయిన పాల‌కులు వారు.) జనాలను పీడించే నిజాం ప్ర‌భుత్వ విధానాలను ఇక్కడి ముస్లింలు, హిందువులు కలిసి ప్రతిఘటించారు. జనాల మధ్య మత సామరస్యమే తప్ప సంఘర్షణకు చోటు లేదు. కుతుబ్‌షాహీలు ఏలినా, అసఫ్‌జాహీలు పాలించినా హైదరాబాద్‌ నేల మీద భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా అందరూ కలిసి మెలిసి జీవించారు. ఆ లౌకిక స్ఫూర్తికి భిన్నమైన ప్రచారాల్ని, చారిత్రక వక్రీకరణల్ని జనం సమ్మతించరు. రాజకీయ లబ్ది కోసం విమోచనోత్సవాల పేరిట విభజన రాజకీయాలకు తెరదీసే కుటిల వ్యూహాల్ని ఆమోదించరు. గంగాజమున తెహజీబ్‌ సంస్కృతిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. కనుకనే విలీన సందర్భాన్ని సమైక్యత, సమగ్రతలని ప్రతిబింబించే ఉత్సవాలుగా జరపాలన్నది తెలంగాణ పాలకుల నిర్ణయం. వివేచన, విజ్ఞతలతో కూడిన దూరదృష్టికి ఇది నిదర్శనం. లౌకిక స్ఫూర్తికి తలమానికం.

First Published:  15 Sept 2022 4:14 PM IST
Next Story