ఒలెక్ట్రాకి గ్రీన్ సిగ్నల్.. రోడ్డెక్కబోతున్న ఇ-టిప్పర్
Olectra Electric tipper: ఒలెక్ట్రా తయారు చేసిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ అన్ని రకాల కఠిన పరీక్షలను తట్టుకుని నిలబడింది. గతుకుల రోడ్లు, ఘాట్ రోడ్లు, పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీ ప్రాంతాల్లో వీటిని పరీక్షించారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతోంది. స్కూటర్లు, కార్లు, బస్సుల వరకు ఓకే. హెవీ వెహికల్స్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకోలేదు. ఈ విభాగంలో ఒలెక్ట్రా సంస్థ తన సత్తా చాటింది.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థగా వాహనాల తయారీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (OGL) ఎలక్ట్రిక్ టిప్పర్లు అందుబాటులోకి తెస్తోంది. హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు హోమోలోగేషన్ సర్టిఫికెట్ ని కూడా ఒలెక్ట్రా సొంతం చేసుకుంది. భారతీయ ఆటోమొబైల్ రెగ్యులేటరీ ఏజెన్సీలనుంచి అన్ని అనుమతులు సాధించింది.
ఎక్కడైనా దూసుకెళ్తుంది..
ఒలెక్ట్రా తయారు చేసిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ అన్ని రకాల కఠిన పరీక్షలను తట్టుకుని నిలబడింది. గతుకుల రోడ్లు, ఘాట్ రోడ్లు, పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీ ప్రాంతాల్లో వీటిని పరీక్షించారు. ఆ తర్వాతే హోమోలోగేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. అన్ని టెస్ట్ లు పాస్ అయిన ఒలెక్ట్రా ఇ-టిప్పర్ త్వరలో అధికారికంగా రోడ్లపైకి రాబోతోంది. మొట్టమొదటిగా 20వాహనాల కోసం ఆర్డర్ పొందింది ఒలెక్ట్రా. త్వరలో వీటిని మార్కెటింగ్ చేయబోతోంది.
భారత్ లో ఎలక్ట్రిక్ హెవీ వెహికల్ సెగ్మెంట్లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఇ-టిప్పర్ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ గా నిలిచిందని చెప్పారు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్. ఇ-టిప్పర్ ప్రోటోటైప్ ను ఢిల్లీ, బెంగళూరులో ప్రదర్శించామని, అందరూ ఆసక్తి చూపించారని వెల్లడించారు. ఇ-టిప్పర్, ఇ-ట్రక్ లు వివిధ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తాయన్నారు.
మైనింగ్, క్వారీ, నిర్మాణ రంగంలోని ప్రదేశాలకు హెవీ మెటీరియల్ ని రవాణా చేసుకోడానికి ఇ-టిప్పర్లు ఉపయోగపడతాయన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ నిర్వహణ వ్యయం చాలా తక్కువ అని అన్నారు. శబ్ద కాలుష్యం ఉండదని, వాయు కాలుష్యం అసలే ఉండదని.. పగలు, రాత్రి తేడా లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు.