డబ్బాల్లో డబ్బు నింపి.. పక్కింటి పైకి విసిరేశాడు.. - విజిలెన్స్ దాడి నేపథ్యంలో సినీ ఫక్కీలో ఘటన
సంబంధిత అధికారి ఇటీవల రూ.2 వేల నోట్లను రూ.500 నోట్ల కింద మార్పిడి చేయించారని తెలిపారు. ఆయన వాటిని 6 బాక్సుల్లో దాచిపెట్టారని చెప్పారు.
విజిలెన్స్ అధికారులు దాడులు చేయనున్నారని సమాచారం వస్తే.. డబ్బు వారికి చిక్కకుండా కాపాడుకునేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడిగా చేసే చర్యలపై సినిమాల్లో అనేక రకాల ఆసక్తికర సన్నివేశాలను చూపిస్తుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే శుక్రవారం ఒడిశాలోనూ చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంతకుమార్ రౌత్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగారు. భువనేశ్వర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డబ్బులో రూ.2 కోట్లకు పైగా నగదు 6 బాక్సుల్లో నింపి.. వాటిని పక్కింటి టెర్రస్‌పైకి విసిరేశారు. ఇది గుర్తించిన అధికారులు ఆ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం రూ.3 కోట్ల నగదు స్వాధీనం..
దీనిపై సీనియర్ విజిలెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సంబంధిత అధికారి ఇటీవల రూ.2 వేల నోట్లను రూ.500 నోట్ల కింద మార్పిడి చేయించారని తెలిపారు. ఆయన వాటిని 6 బాక్సుల్లో దాచిపెట్టారని చెప్పారు. వాటిని తాము సోదాల్లో భాగంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మరో 9 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో దాడులు చేపట్టినట్టు ఆయన వివరించారు. నబరంగ్‌పూర్‌లో బాక్సుల్లో ఉన్న నగదుతో పాటు మరో రూ.77 లక్షలు పట్టుబడ్డాయని తెలిపారు. మొత్తంగా రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
గతంలోనూ లంచం కేసులో అరెస్ట్..
జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ రౌత్ పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. 2018లో సుందర్ గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో ప్రశాంత్‌కుమార్ రౌత్ లంచం కేసులో ఒకసారి అరెస్టయ్యారు.