Telugu Global
National

ఒడిశా రైలు ప్రమాదం: పరిహారం కోసం డ్రామాలాడిన భార్య‌పై భర్త ఫిర్యాదు

అయితే ఆమె ఇచ్చిన ఆధార్ కార్డులో గీతాంజలి వయస్సు 60 ఏళ్ళు ఉన్నట్లు ఉంది. కానీ ఆమెకు అంత వయసు కనిపించకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది.

ఒడిశా రైలు ప్రమాదం: పరిహారం కోసం డ్రామాలాడిన భార్య‌పై భర్త ఫిర్యాదు
X

ఒడిశా రాష్ట్రం బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఓ మహిళ తన భర్త చనిపోయాడని అధికారులను చీట్ చేసి పరిహారం పొందే ప్రయత్నం చేసింది. చివరికి అధికారులకు చిక్కింది. ఈ వ్యవహారంలో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె భర్తే ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.

కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన బిజయ్ దత్తా(40), గీతాంజలి దత్తా(35) దంపతులు. గొడవల కారణంగా వీరు గత 13 సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. కాగా, బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు బాధితులకు ప్రభుత్వ పరిహారాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే.. గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదం జరిగిన బహనాగా వద్దకు వచ్చి అధికారులను కలిసింది. తన భర్త బిజయ్ దత్తా కనిపించడం లేదని వారికి చెప్పింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించినట్లు వివరిస్తూ కంటతడి పెట్టుకుంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారని తెలుసుకొని అన్ని ఆసుపత్రులకు తిరిగానని.. ఎక్కడా తన భర్త ఆచూకీ లభించలేదని అధికారులతో తెలిపింది.

దీంతో పోలీసులు ఆమెను ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న ఫొటోల్లో నీ భర్త ఫొటో ఉందో లేదో చూసుకోవాలని పోలీసులు సూచించారు. కొన్ని ఫొటోలు చూసిన తర్వాత ఆమె ఇతడే తన భర్త బిజయ్ అని ఓ ఫొటోను పోలీసులకు చూపింది. ఆ తర్వాత తన భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి గీతాంజలి తన అడ్రెస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డును అందజేసింది.

అయితే ఆమె ఇచ్చిన ఆధార్ కార్డులో గీతాంజలి వయస్సు 60 ఏళ్ళు ఉన్నట్లు ఉంది. కానీ ఆమెకు అంత వయసు కనిపించకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించగా.. గీతాంజలి భర్త బిజయ్ బతికే ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు సదరు మహిళను పిలిచి పరిహారం పొందడానికి డ్రామాలు ఆడటంపై మందలించారు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి ఆమెను పంపారు.

అయితే పోలీసులు, అధికారుల వద్ద గీతాంజ‌లి ఆడిన డ్రామా గురించి ఆమె భర్త బిజయ్ కి తెలిసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని తాజాగా బిజయ్ మనియబంధ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజాధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు, నకిలీ పత్రాలతో బతికి ఉన్న తనను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని అతడు పోలీసులను కోరాడు. భర్త ఫిర్యాదు చేసిన తర్వాత అరెస్ట్ కు భయపడిన గీతాంజలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు మనియబంధ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ బసంత్ కుమార్ తెలిపారు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని బహనాగా వద్ద జరిగినందువల్ల అక్కడి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని బిజయ్ కి సూచించినట్లు ఆయన తెలిపారు.

First Published:  7 Jun 2023 7:44 PM IST
Next Story