Telugu Global
National

మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్‌.. ఒడిశాలో ముగ్గురికి

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ సోకింది.

మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్‌.. ఒడిశాలో ముగ్గురికి
X

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఆరోగ్య అధికారులు అలెర్ట్‌ అయ్యారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం తిన్న కారణంగా ముగ్గురు గ్రామస్తులకు ఈ మహమ్మారి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. వారిని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక వైద్యాధికారి వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. ముగ్గురు గ్రామస్థులు రెండు రోజుల క్రితం ఆవు మాంసాన్ని తిన్నారు. తరువాత వారు కాలు, చేతులపై పుండ్లు ఏర్పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని లక్ష్మీపూర్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారు . వైద్యులు పరీక్ష చేసి ఆంత్రాక్స్‌ లక్షణాలుగా అనుమానించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. అయితే విషయం జిల్లా ముఖ్య వైద్యాధికారికి తెలియజేయడంతో తక్షణం స్పందించారు.

ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామానికి పంపి రోగులను కొరాపుట్‌ లక్ష్మణ్‌నాయక్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అలాగే రోగుల రక్త నమూనాలను సేకరించి మరోసారి వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షకు పంపించారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆంత్రాక్స్ వ్యాధి కారణాలు, జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

'బాసిల్లస్ ఆంత్రాసిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. కానీ, కొన్ని కేసుల్లో రెండు నెలల వరకూ లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు కూడా. చర్మంపై పుండ్లు, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం, నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరేచనాలు దీని లక్షణాలు. చర్మంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత ఆ భాగంలో పురుగు కుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది.

ఒకట్రెండు రోజుల్లో ఆ ప్రాంతం ఉబ్బి పుండుగా మారుతుంది. నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి కేసుల్లో 20 శాతం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది.

First Published:  1 Jun 2024 6:00 AM IST
Next Story