ఒడిశా హెల్త్ మినిస్టర్ పై తుపాకీ కాల్పులు.. పరిస్థితి విషమం
నబకిషోర్ పై కాల్పులు జరిగినట్లు తెలుసుకున్న బీజేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గాంధీ చౌక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఒడిశాలో బిజు జనతాదళ్ నేత, హెల్త్ మినిస్టర్ నబకిషోర్ దాస్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో నబకిషోర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను పార్టీ కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. బిజు జనతాదళ్ లో సీనియర్ నేత అయిన నబకిషోర్ ఆదివారం ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్ద ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఆయన బయలుదేరే సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. అతి సమీపంలో నుంచి కాల్పులు జరపడంతో ఆయన ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అప్రమత్తం అయిన కార్యకర్తలు ఆయన్ను చికిత్స కోసం సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. నబకిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నబకిషోర్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నబకిషోర్ పై కాల్పులు జరిగినట్లు తెలుసుకున్న బీజేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గాంధీ చౌక్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, గోపాల్ చంద్రదాస్ అనే ఏఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్ తో అతి సమీపం నుంచి మంత్రిని కాల్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే గోపాల్ చంద్రదాస్ నబకిషోర్ పై ఎందుకు కాల్పులకు తెగబడాల్సి వచ్చిందనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
గోపాల్ చంద్రదాస్ వ్యక్తిగత కక్షతో కాల్పులకు పాల్పడ్డారా? ఎవరైనా చేయించారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కాగా వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నబకిషోర్ పై కాల్పులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.