తన ప్రాణం పోయినా 48 మందిని కాపాడిన బస్ డ్రైవర్
ప్రయాణం మధ్యలో గుండెనొప్పి రావడంతో డ్రైవర్ సనాప్రధాన్ తానిక బస్ నడపలేడని గ్రహించాడు. దీంతో అతను బస్సును రోడ్డు పక్కన ఉన్న గోడకు ఢీకొట్టాడు
బస్ డ్రైవ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినా.. 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఒడిశా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. సనా ప్రధాన్ అనే ఓ బస్సు డ్రైవర్ 48 మంది ప్రయాణికులను తన బస్సులో ఎక్కించుకొని భువనేశ్వర్ నగరానికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది. అయితే గుండెపోటుతో తుది శ్వాస విడిచే ముందు డ్రైవర్ సనా ప్రధాన్ తన సమయ స్పూర్తిని ప్రదర్శించాడు. ఎవరికీ ఏమి చప్పలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ బస్సును అతి జాగ్రత్తగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపంలో రాత్రి జరిగిందని ప్రయాణికులు తెలిపారు.
ప్రయాణం మధ్యలో గుండెనొప్పి రావడంతో డ్రైవర్ సనాప్రధాన్ తానిక బస్ నడపలేడని గ్రహించాడు. దీంతో అతను బస్సును రోడ్డు పక్కన ఉన్న గోడకు ఢీకొట్టాడు, ఆ వెంటనే బస్సు ఆగిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలిగాడని స్థానిక టికాబలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. ఘటన తర్వాత డ్రైవరు సనా ప్రధాన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, హార్ట్ ఎటాక్ అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దిసేపటి తర్వాత బస్సులో ఉన్న మరో డ్రైవర్ ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును తన గమ్యస్థానానికి చేర్చారు.
డ్రైవర్ ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వివరించారు. డ్రైవరు తన జీవితపు చివరి నిమిషంలో కూడా ఇతరుల ప్రాణాలు కాపాడటంపై శ్రద్ధ చూపడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెబుతున్నారు. మృతుని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.