Telugu Global
National

'వాలెంటేన్ డే' రోజును 'కౌ హగ్ డే' గా పాటించండి... ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు పిలుపు

పశుసంవర్ధక,ఫిషరీస్, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’గా జరుపుకోండి అని పిలుపునిచ్చింది.

వాలెంటేన్ డే రోజును కౌ హగ్ డే గా పాటించండి... ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు పిలుపు
X

చాలా కాలంగా వాలెంటేన్ డే మీద దాడులు చేస్తున్న హిందుత్వ సంఘాలు ఈ సారి కూడా ఫిబ్రవరి 14న వాలెంటేన్ డే ను వ్యతిరేకించే కార్యకలాపాలకు సిద్దమవుతున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా వాలెంటేన్ డే ను పలచన చేయడానికి దానికి పోటీగా ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’గా జరుపుతోంది.

పశుసంవర్ధక,ఫిషరీస్, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’గా జరుపుకోండి అని పిలుపునిచ్చింది.

వైదిక సంప్రదాయం, ఆవు వల్ల‌ ఉన్న అపారమైన ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో, భారత జంతు సంక్షేమ బోర్డు ఫిబ్రవరి 14న 'కౌ హగ్ డే'ని జరుపుకోవాలని ప్రజలను కోరింది.

“ఆవు భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, అది మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద, జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మనందరికీ తెలుసు. మానవాళికి సకల సంపదలను అందించే పోషక స్వభావం ఉన్నందున దీనిని "కామధేను" , "గోమాత" అని పిలుస్తారు. ”అని జంతు సంక్షేమ బోర్డు తన‌ ప్రకటనలో తెలియజేసింది.

పాశ్చాత్య సంస్కృతి కారణంగా వైదిక సంప్రదాయాలు అంతరించిపోయే అంచున ఉన్నాయని ఆ ప్రకటన‌ పేర్కొంది.

"పాశ్చాత్య నాగరికతకున్న ఆకర్షణ‌ మన సంస్కృతి, వారసత్వాన్ని దాదాపు మరచిపోయేలా చేసింది" అని బోర్డు పేర్కొంది.

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ప్రకటన ప్రకారం, ఆవు వల్ల కలిగే అపారమైన ప్రయోజనాల కారణంగా, ఆవులను కౌగిలించుకోవడం గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుంది.

"అందుకే, ఆవు ప్రేమికులందరూ కూడా ఆవు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జీవితాన్ని సంతోషంగా, పాజిటీవ్ శక్తితో నింపడానికి ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా జరుపుకోవాలి" అని ప్రకటన పేర్కొంది.




ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక మంత్రి ధరంపాల్ సింగ్ కూడా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కాకుండా ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని ప్రజలను కోరారు.

మీడియాతో మాట్లాడిన మంత్రి, “ఆవు ప్రపంచానికి తల్లి, దాని మూత్రం, పేడ కూడా ఔషధంగా పనిచేసే గొప్ప శక్తి ప్రపంచంలో ఒక ఆవుకే ఉంది. కేవలం ఆవు స్పర్శతో అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు, అందుకే ప్రజలు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్ డేని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను, ”అని ఆయన అన్నారు.

వాలెంటైన్స్ డే గురించి ఇంకా మాట్లాడుతూ, “సమాజాన్ని చెడు దారి పట్టించే వాటి నుండి దూరం పాటించాలి కాబట్టి వాలెంటైన్స్ డే జరుపుకోకూడదని నేను కూడా భావిస్తున్నాను.'' అని అన్నారాయన.

First Published:  9 Feb 2023 4:44 PM IST
Next Story