ప్రజ్వల్ రేవణ్ణపై లుక్‌అవుట్ నోటీసులు
తనపై వచ్చిన ఆరోపణలపైనా ఫస్ట్ టైమ్ ప్రజ్వల్ స్పందించారు. విచారణకు హాజరుకావడానికి ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. త్వరలోనే సత్యం గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు.
హసన్ సెక్స్ స్కాండల్ కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీలైనంత త్వరగా విచారణకు హాజరుకావాలన్నారు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర. మరోవైపు విచారణకు హాజరయ్యేందుకు ఏడు రోజుల సమయం కావాలని ప్రజ్వల్ చేసిన విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది.
ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి H.D.రేవణ్ణలు తనను లైంగికంగా ఓ వేధించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రేవణ్ణ ఇంట్లో తాను పని మనిషిగా చేశానన్న సదరు మహిళ.. ప్రజ్వల్ రేవణ్ణ తన కూతురిని వీడియో కాల్స్‌లో లైంగికంగా వేధించాడని ఆరోపించింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు ఆ వీడియోలు మార్ఫింగ్ చేసినవేనని ప్రజ్వల్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపైనా ఫస్ట్ టైమ్ ప్రజ్వల్ స్పందించారు. విచారణకు హాజరుకావడానికి ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. త్వరలోనే సత్యం గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ వీడియోలు బయటకు రావడం కర్ణాటకలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో.. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నలు సంధిస్తోంది.