అందరూ అప్రూవర్లయితే నిందితులెవరు?
అప్రూవర్లుగా మారిపోయే అవకాశం ఇవ్వాలని వాళ్లు పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తర్వాతే ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. దాని ప్రకారమే తాజాగా మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం చాలా విచిత్రంగా తయారవుతోంది. ఈ కేసులో అప్రూవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. చివరకు అందరూ అప్రూవర్లే అయితే ఇక నిందితులు ఎవరు అన్న ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ విచారణ చేసి అరెస్టు చేసినవారిలో అత్యధికులు అప్రూవర్లుగా మారిపోయారు. అరెస్టు అయినవారిలో ఐదుగురు అప్రూవర్లుగా మారటమే ఆశ్చర్యంగా ఉంది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డి, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇప్పటివరకు అప్రూవర్లుగా మారారు.
అప్రూవర్లుగా మారిపోయే అవకాశం ఇవ్వాలని వాళ్లు పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తర్వాతే ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. దాని ప్రకారమే తాజాగా మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారిపోయారు. అప్రూవర్లుగా మారిపోవటమే కాకుండా వీళ్ళంతా జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చేశారు కూడా. ఇక జైలులోనే మిగిలిపోయింది ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీష్ శిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రమే. తాజాగా అరెస్టయ్యింది ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఇద్దరు కూడా ఆప్‌లో కీలక నేతలు కావటమే. ఈడీ విచారణ తీరు చూస్తుంటే ఆప్ కీలక నేతలు మాత్రమే టార్గెట్టా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నరేంద్ర మోడీకి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా తయారైన విషయం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్‌ను దెబ్బకొట్టాలని మోడీ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలన్నది మోడీ పట్టుదల. అందుకనే కేజ్రీవాల్‌తో పాటు ఆప్ ప్రభుత్వాన్ని వీలైనంతగా బజారుకీడ్చేస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇద్దరు కీలక నేతలను అరెస్టు చేసి జైలులో పెట్టడమే కాకుండా కేజ్రీవాల్‌ను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ను ఈడీ ఇలా విచారించి అలా వదిలిపెట్టేసింది. కేజ్రీవాల్ విషయంలో ముందు ముందు ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఇంతమంది అప్రూవర్లుగా మారిపోయిన కేసు బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కటేనేమో.
♦