ఇక వర్చువల్ టూరిజం..! - స్వయంగా పర్యటించినట్టే అనుభూతి..!
తమిళనాడు టూరిజం శాఖ వీఆర్ ఆధారిత బుక్‌లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేసి వెబ్‌సైట్‌లో సైతం అందుబాటులో ఉంచింది.
కొత్త ప్రాంతాలను చూడాలని, పర్యాటక ప్రదేశాలను వీక్షించాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. వ్యయప్రయాసలు, సెలవుల సమస్యలు, ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడం వంటి అనేక ఇబ్బందుల వల్ల ఎంతోమందికి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వీలుకాదు. ఇలాంటివారికి ఇది ఎగిరి గంతేసే లాంటి వార్తే ఇది. ఎక్కడికీ వెళ్లకుండానే కూర్చున్నచోట నుంచే పర్యాటక ప్రాంతాలను స్వయంగా పర్యటించిన అనుభూతితో వీక్షించే అవకాశం అందుబాటులోకి రావడమే దీనికి కారణం.
వర్చువల్ టూరిజం ఇలా..
టూరిజం ఇకపై వర్చువల్‌గా చేసేయొచ్చు. ఒకే స్థలంలో కూర్చొని పర్యాటకులు తాము కోరుకున్న ప్రదేశాలను చుట్టిరావచ్చు. పర్యాటకులు వీఆర్ కళ్లజోళ్లను ధరించి రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగిస్తూ గమ్యస్థానాల్లో కలియదిరిగే అనుభూతిని పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
సాంకేతికతతో అందుబాటులోకి..
నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్‌లో భాగంగా యూనిఫైడ్ టూరిజం ఇంటర్‌ఫేస్ కోసం కేంద్ర పర్యాటక శాఖ కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), వెబ్ పోర్టల్, టూరిస్టు డెస్టినీ యాప్‌లను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వర్చువల్, అగుమెంటెడ్ రియాల్టీ (వీఆర్, ఏఆర్) సరికొత్త పర్యాటక అనుభూతులను అందిస్తోంది. ఇప్పటికే పలు మ్యూజియాల్లో ఏఆర్, వీఆర్ విశేషాదరణ పొందుతున్నాయి. శిల్పారామాల్లో సైతం 12డీ వర్చువల్ అనుభూతులను విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు మ్యూజియాలు సైతం ఆన్‌లైన్ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి.
వివిధ రాష్ట్రాల్లోనూ..
తమిళనాడు టూరిజం శాఖ వీఆర్ ఆధారిత బుక్‌లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీని అభివృద్ధి చేసి వెబ్‌సైట్‌లో సైతం అందుబాటులో ఉంచింది. 2016లో గుజరాత్ టూరిజం సింధు లోయలోని లోథాల్, ధోలవీర, రాణి-కి-వావ్ సహా అనేక పురాతన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో లైవ్ యాక్షన్ వీఆర్ వీడియోలను రూపొందించింది. 2021లో కేరళ టూరిజం శాఖ వర్చువల్ టూర్ గైడ్ కోసం ఏఆర్ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రియల్ టైమ్ ఆడియో వీడియో గైడ్‌గా ప్రసిద్ధి చెందింది.