నాడు ఛీత్కారాలు..నేడు సెల్యూట్ లు!
చిన్నప్పటి నుంచి అనేక అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నఈ తొమ్మిది మందిట్రాన్స్‌జెండర్లు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. చత్తీస్ గడ్ పోలీసు శాఖలో చేరిన వీళ్ళు, తమకు జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు .
ఒకప్పుడు వారంతా ఎన్నో అవమానాలు,దూషణలు ఎదుర్కొన్నారు. నేడు వారి జీవితాల్లో నవోదయం తొంగి చూస్తోంది. నాడు ఛీత్కరించున్న చేతులే నేడు వారికి సెల్యూట్ చేస్తున్నాయి. ఈ అనుభూతితో మనసు నిండిపోతోంది. కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు(థర్డ్ జెండర్). ఇప్పటికే పలువురు ట్రాన్స్‌జెండర్లు రాజకీయాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే.
మావోయిస్టు ప్రాబల్యం ఉన్నబస్తర్ డివిజన్ లో చత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక విభాగమైన బస్తర్ ఫైటర్స్ లో వీరు ఉద్యోగంలో చేరారు. వీరి చేరికతో మొత్తం రాష్ట్ర పోలీసు శాఖలో 22 మంది ట్రాన్స్‌జెండర్ పోలీసులు ఉన్నారు. "నేను ఎన్నోయేళ్ళగా ఛీత్కారాలు, హేళనలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నేను ఒక పోలీస్ అయ్యాను "అని 24 యేళ్ళ దివ్య నిషాద్ ఆనందంతోచెప్పారు.
2020లో ఛత్తీస్‌గఢ్ పోలీసు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, అక్టోబర్-నవంబర్ 2021లో జిల్లాల వారీగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసు శాఖ లెక్కల ప్రకారం బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల నుంచి మొత్తం 53,336 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 15న ప్రకటించిన ఫలితాల ద్వారా పోలీస్ ఫోర్స్‌లోకి మొత్తం 608 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
దివ్య తన ప్రయాణాన్ని వివరిస్తూ, "మా జీవితం ఎప్పుడూ ప్రజలకు నవ్వు తెప్పించేది. ఇప్పటివరకు అవహేళనలు ఎదుర్కొన్నాం. నా విద్యాభ్యాస కాలం అంతా నన్ను ఎప్పుడూ ఎగతాళి చేసేవారు, దుర్భాషలాడేవారు. ఒకసారి మా నాన్న నన్ను అసభ్యంగా పిలిచారు. నా వల్ల పరువుపోతోందని నిందించారు. నేను ఇంటిని విడిచిపెట్టి ఒక సంవత్సరం వరకు తిరిగి రాలేదు" అని దివ్య చెప్పారు. అప్పుడు నవ్విన వారే, ఎగతాళి చేసిన వారే ఇప్పుడు సెల్యూట్ చేస్తారు" అని అన్నారు.
తమ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తిని తానేనని, అందుకు సహకరించిన తన తల్లికి దివ్య కృతజ్ఞతలు తెలిపారు.
24 ఏళ్ల బర్ఖా బాఘేల్ బస్తర్ జిల్లాలో దాదాపు 200 కి.మీ దూరంలోని హల్బా కజోరా గ్రామంలో నివసిస్తున్నారు. బస్తర్ ఫైటర్స్‌లో చేరడానికి ఆమె ప్రయాణం కూడా అంత తేలికైనది కాదు. గ్రామంలో ప్రముఖ వ్యక్తి అయిన బర్ఖా తండ్రి అయతు రామ్ బాఘేల్, బర్ఖా పరిస్థితి తన స్థాయిని దెబ్బతీస్తుందని, ప్రజలు తనని ఎగతాళి చేస్తారని భయపడేవారు. "మా సవతి సోదరులు నన్ను కొట్టేవారు. ఇప్పటి వరకు దుర్భరమైన జీవితం గడిపాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతాయని నేను ఆశిస్తున్నాను. " అని బర్ఖా అన్నారు. ఫోర్స్‌లో చేరడానికి ముందు, బర్ఖా 2018 నుండి ఫిజియోథెరపీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
దేశానికి ఆదర్శం కావాలి..
రాయ్‌పూర్‌కు చెందిన హక్కుల కార్యకర్త విద్యా రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లను పోలీసు శాఖలో చేర్చుకోవడం దేశానికే ఆదర్శం అని అన్నారు. "ట్రాన్స్‌జెండర్లు పోలీస్ ఫోర్స్‌లో ఎంపికయ్యేలా సహాయం చేసినందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఛత్తీస్‌గఢ్ అడుగులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలి'' అని రాజ్‌పుత్ అన్నారు.
ఎంపికైన అభ్యర్థులను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ అభినందించారు. "పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్ల నియామకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు మా ప్రభుత్వం ప్రారంభించిన ఒక అడుగు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు, కానిస్టేబులరీకి అవగాహన కల్పించేలా ప్రయత్నిస్తాం" అని ముఖ్యమంత్రి అన్నారు. బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సుందర్‌రాజ్ మాట్లాడుతూ .. కొత్తగా రిక్రూట్ అయిన సిబ్బంది ఎలాంటి వివక్షకు గురికాకుండా చక్కటి పని వాతావరణం ఉండేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు మార్చి 2021లో,థర్డ్ జెండర్ కమ్యూనిటీకి చెందిన 13 మంది చత్తీస్‌గఢ్ పోలీసు దళంలో చేరారు.