కారు వెనక సీట్లలోనూ సీట్ బెల్టు తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
ఇకపై కారులో వెనక కూర్చున్న వాళ్ళు కూడా తప్పని సరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. టాటా సన్స్ మాజీ చైర్ మెన్ సైరెస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. దీంతో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి కారణాలను కేంద్రం అన్వేషించి ఈ సంఖ్యను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్లలో ముందు సీటులో కూర్చున్న వారికే కాకుండా వెనక సీట్లలో కూర్చున్నప్రయాణీకులు కూడా సీటు బెల్టులు తప్పనిసరిగా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత ఫైలు పై సంతకం చేశానని ఆయన పేర్కొన్నారు. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వాహన తయారీదారులు ప్రతి కారులో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలి. అని పేర్కొన్నారు.
ప్రస్తుతం అన్ని వాహన తయారీదారులు ముందు సీటు ప్రయాణికులకు మాత్రమే సీట్ బెల్ట్ రిమైండర్‌లను అందించడం తప్పనిసరి. కారులో సీటు బెల్టు పెట్టుకోని వారిని గుర్తించి, అటువంటి వారిపై ఆటోమేటిక్‌గా ప్రాసిక్యూట్ చేయడానికి జాతీయ రహదార్లపై అమర్చిన కెమెరాల పరిధిని విస్తరించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాము' అని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. ఇకపై తయారయ్యే వాహనాలకు వెనక సీట్లలో కూడా సీటు బెల్టులు, అలారం విధానం పొందుపర్చాలని మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరగడానికి కారణం కార్లలో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు పెట్టుకోక పోవడమేనని కేంద్రం రోడ్డు రవాణ విభాగం నిపుణుల సంస్థ చేసిన ఆడిట్ తెలిపింది. 2020వ సంవత్సరంలో దేశంలో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో 15,146 మంది ప్రాణాలు కోల్పోయారని తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్లను కేంద్ర రవాణశాఖ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.