Telugu Global
National

కస్టమర్లే కాదు, డెలివరీ బాయ్స్ చేతిలో కంపెనీలు కూడా మోసపోతాయి..

వారం రోజులపాటు తనకు వచ్చిన వస్తువులన్నింటినీ రీ షెడ్యూల్ చేసి, కస్టమర్ల వద్ద వాటికి డబ్బు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఇలా మొత్తం రూ. 7.63 లక్షలు కొట్టేశాడు.

కస్టమర్లే కాదు, డెలివరీ బాయ్స్ చేతిలో కంపెనీలు కూడా మోసపోతాయి..
X

కస్టమర్లను మోసం చేసే డెలివరీ బాయ్స్ ని మనం చూస్తూనే ఉంటాం. మనం ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఒకటి, మన చేతిలో పెట్టేది మరొకటి.. ఇలా డెలివరీ మోసాలు కోకొల్లలు. అయితే ఢిల్లీకి చెందిన ఓ డెలివరీ బాయ్ ఏకంగా తాను పనిచేసే సంస్థకే కన్నం వేశాడు. 7.63 లక్షల రూపాయలు కాజేసాడు. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగేంత వరకు ఆ సంస్థ ఎందుకు సైలెంట్ గా ఉందనేగా మీ అనుమానం. అక్కడే మనోడు తన బుర్ర ఉపయోగించాడు. కంపెనీకి ఏమాత్రం అనుమానం రాకుండా 7.63 లక్షలు ఎగ్గొట్టాడు. తీరా అనుమానం వచ్చే సరికి పారిపోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

మోసం ఇలా జరిగింది..?

సహజంగా డెలివరీ బాయ్స్ ఉదయాన్నే తమకు కేటాయించిన వస్తువులను తీసుకుని ఆయా అడ్రస్ లకు వెళ్తుంటారు. సాయంత్రానికి డెలివరీ ఇచ్చిన స్టేటస్ ను ఆఫీస్ లో చూపించి, నగదు జమ చేసిన అకౌంట్ తో సరిపోల్చుకుంటారు, అడ్రస్ సరిగా లేక మిగిలినపోయిన వస్తువులను తిరిగి ఇచ్చేయడమో లేక తమవద్దే ఉంచుకుని మరుసటి రోజు ఇవ్వడమో చేస్తుంటారు. ఇక్కడే చిన్న మతలబు ఉంది. కస్టమర్ సమయానికి ఊరిలో లేకపోతే తాము వచ్చేంత వరకు ఆ వస్తువుని ఉంచాలని, అవసరమైతే రీ షెడ్యూల్ చేయాలని కోరుతుంటారు. ఇలా రీషెడ్యూల్ చేసిన వస్తువులు నాలుగైదు రోజుల తర్వాత తిరిగి షెడ్యూల్ కి వస్తుంటాయి. ఇలా తనకు కేటాయించిన అన్ని వస్తువులను రీషెడ్యూల్ చేసినట్టు కవర్ చేశాడు డెలివరీ బాయ్ వినయ్ శ్రీపాద ప్రసాద్. కంపెనీ దృష్టిలో ఆయా వస్తువుల్ని రీ షెడ్యూల్ చేశాడు. కానీ కస్టమర్లకు మాత్రం వాటిని డెలివరీ చేశాడు. దానికి సంబంధించిన సొమ్ముని తన పర్సనల్ అకౌంట్ కి పంపించుకున్నాడు.

ఇటు కంపెనీకి విషయం తెలియలేదు. వస్తువు రీ షెడ్యూల్ అయింది కాబట్టి దాని స్టేటస్ గురించి కంపెనీ పట్టించుకోలేదు. ఇలా వారం రోజులపాటు తనకు వచ్చిన వస్తువులన్నిటినీ రీ షెడ్యూల్ చేసి, కస్టమర్ల వద్ద వాటికి డబ్బు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఇలా మొత్తం రూ. 7.63 లక్షలు కొట్టేశాడు. తీరా కంపెనీకి అనుమానం వచ్చి ఆరా తీసే సమయానికి మెల్లగా జారుకున్నాడు. కంపెనీ ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని వెతికి పట్టుకున్నారు. 24 ఏళ్ల డెలివరీ బాయ్ వినయ్ శ్రీపాదను లోనికండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

First Published:  22 Sept 2022 9:19 AM
Next Story