ఇంటి పని చేయడం చులకన కాదు.. బాంబే హైకోర్టు తీర్పు
ఇంటి పనులు చేయాలని వివాహిత మహిళకు అత్తింటివారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
ఇంటి పని మొత్తం తనకే అప్పగిస్తున్నారని, తనని ఓ పని మనిషిలా చూస్తున్నారంటూ ఇటీవల ఓ కోడలు బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనిపై ధర్మాసనం స్పందన మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. ఇంటి పనులు చేయాలని వివాహిత మహిళకు అత్తింటివారు చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
పని మనిషి అనుకోవద్దు..
ఒక వివాహితను ఇంటి పని చేయాలంటూ అత్తింటివారు ఆదేశిస్తే అది కచ్చితంగా కుటుంబ అవసరాల కోసమే కాని, పనిమనిషిలా ట్రీట్ చేస్తున్నారనుకోవడం భావ్యం కాదని సూచించింది ధర్మాసనం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే, పెళ్లికి ముందే ఆ విషయం గురించి మాట్లాడుకోవాలని, అప్పుడు వరుడి కుటుంబ సభ్యులకు వివాహం విషంయలో మరోసారి అలోచించుకునే వీలుంటుందని చెప్పింది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలి సూచించింది.
గృహ హింస కాదు..
ఇంటి పనులు చేయాలని చెప్పడం గృహ హింసకు సంబంధం లేదని చెప్పింది కోర్టు. ఇంటి పనులు చేయాలని చెప్పడాన్ని కారణంగా చూపిస్తూ అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేయడం సరికాదని హెచ్చరించింది. సదరు వివాహిత.. భర్త, అత్త మామలపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.