Telugu Global
National

నాగాలాండ్ లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం.. ఎన్డీపీపీకి అన్ని పార్టీల మద్దతు

నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా కూటమికి మిగిలిన అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

నాగాలాండ్ లో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం.. ఎన్డీపీపీకి అన్ని పార్టీల మద్దతు
X

మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షమూ ఉంటుంది. అయితే ఇటీవల ఎన్నికలు జ‌రిగి ఫలితాలు వెల్లడైన నాగాలాండ్ లో మాత్రం ప్రతిపక్షమేలేని ప్రభుత్వం ఏర్పడనుంది. నాగాలాండ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను సాధించింది. అయితే ఎన్ డీపీపీ-బీజేపీ కూటమికి రాష్ట్రంలోని మిగిలిన పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్షమే లేని ప్రభుత్వం అవతరించనుంది.

60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికల జరిగాయి. ఈనెల రెండవ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాలు సాధించగా, NCP 4 స్థానాలు, NPP - 4, NPF - 2 ఇతరులు 16 స్థానాల్లో విజయం సాధించాయి. నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా కూటమికి మిగిలిన అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాష్ట్రంలోని కొన్ని చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు అధికార కూటమికి మద్దతు ప్రకటించగా తాజాగా ఎన్సీపీ, ఎన్పీఎఫ్ కూడా ఎన్డీపీపీ-బీజేపీ కూటమితో చేతులు కలిపాయి. ఎన్డీపీపీ-బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నిఫియు రియో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. నిఫియు రియో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది ఐదో సారి. నిఫియు ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపితే రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. కాగా, నాగాలాండ్ లో ప్రతిపక్షమేలేని ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండు దఫాలు ఇదేవిధంగా జరిగింది. 2015, 2021లో జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు అధికార కూటమికి మద్దతు ప్రకటించాయి.

First Published:  6 March 2023 6:23 AM GMT
Next Story