మహారాష్ట్రలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ
మంగళవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసిన సీఎం ఏక్‌నాథ్ శిండే , డిప్యూటీ సీఎం అజిత్ పవార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. సీఎం ఏక్‌నాథ్ శిండే కోప్రీ-పచ్‌పభాడీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన శిండే ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి మంగళవారం చివరి రోజు కాగా.. ఇవాళ చాలామంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనున్నది. 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
బారామతిలో ప 'వార్'
బారామతి ఎన్సీపీకి కంచుకోట. ఆపార్టీలో చీలిక వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం లో పవార్ కుటుంబ సభ్యులే వేర్వేరు పార్టీల నుంచి పోటీ ఉండటంతో ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇవాళ బారామతి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనపై పోటీకి ఎన్సీపీ (శరద్ పవార్ ) తరఫున యుగేంద్ర పవార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఆ పార్టీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే తదితరులు వచ్చారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత పవార్‌ల రాజకీయ ప్రస్థానానికి బారామతి వేదిగా మారింది. అజిత్ పవార్ సోదరుడైన శ్రీనివాస్ కుమారుడే యుగేంద్ర. నామినేషన్ అనంతరం కొత్త తరం నాయకత్వాన్ని ఆదరించాలని శరద్‌పవార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.