రోడ్లపై చెత్త వేస్తే లక్ష రూపాయల జరిమానా..
చిన్న చిన్న కవర్లు రోడ్లపై పడేసినా రూ.5వేలతో ఫైన్ మోత మోగుతుంది. పదే పదే తప్పులు చేస్తుంటే జరిమానా ఏకంగా లక్షకు పెరుగుతుంది.
రోడ్లపై చెత్త పారబోస్తే పదో పరకో జరిమానా సహజం. మహా అయితే వంద రూపాయలు కూడా జరిమానాలు విధించే కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ నొయిడాలో మాత్రం ఆ జరిమానాను ఏకంగా లక్ష రూపాయలకు పెంచారు. అంతే కాదు, తప్పు చేసినవారు తప్పించుకోకుండా ఉండేందుకు సీసీ టీవీలతో నిఘా పెడుతున్నారు. అంటే నోయిడాలో రోడ్లపై చెత్త వేసి, ఆ తప్పు తమది కాదు అని ఎవరూ తప్పించుకోలేరన్నమాట. నేరం తీవ్రతను బట్టి కనిష్టంగా 5వేల జరిమానాతో సరిపెడతారు అధికారులు. ఎడాపెడా చెత్త వేస్తూ పదే పదే సీసీ కెమెరాలకు బుక్ అయితే మాత్రం లక్ష రూపాయలు కార్పొరేషన్ కి కట్టాల్సిందే. లేకపోతే ఇతర పన్నుల చెల్లింపు విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో చెత్త సమస్య ఎప్పుడూ ఉండేదే. తడి చెత్త, పొడి చెత్త అంటూ వేర్వేరు డస్ట్ బిన్లు ఇచ్చి, ప్రతి రోజూ చెత్త సేకరించే వాహనాన్ని ఇంటికి పంపిస్తున్నా.. రోడ్లపై చెత్త వేసే అలవాటు చాలామంది మానుకోలేరు. ఇంట్లోని చెత్తా చెదారాన్ని నీట్ గా క్యారీబ్యాగ్ లో చుట్టేసి, రోడ్డుపైకి వచ్చేసి ఎవరూ చూడనప్పుడు అలా గిరాటేసి వెళ్లిపోవడం చాలామందికి అలవాటే. అలాంటి వారందరినీ లక్ష రూపాయల జరిమానాతో భయపెడుతోంది నొయిడా కార్పొరేషన్.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకుల్లో నొయిడా నగరం ఉత్తర ప్రదేశ్ లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉంది. దీన్ని మరింత మెరుగు పరచి జాతీయ స్థాయిలో తొలి స్థానం సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అధికారులు. ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి రోజూ నొయిడాలో 650 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని సేకరించేందుకు, డంపింగ్ యార్డ్ లకు తరలించేందుకు విరివిగా వాహనాలు ఉపయోగిస్తున్నారు. అయినా కూడా రోడ్లపైకి చెత్త చేరుతోంది. దీంతో నగరంలో ప్రత్యేకంగా 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనపడే ప్రాంతాల్లో వీటిని పెడుతున్నారు. ఇకపై ఎవరైనా అక్కడ చెత్త వేస్తే ఈజీగా దొరికిపోతారనమాట.
లక్ష రూపాయలంటే మాటలా..?
ప్రాణ రక్షణకోసం హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే జరిమానా వేస్తామంటే జనం వినట్లేదు. అలాంటిది నగరం పరిశుభ్రంగా ఉంటుంది చెత్తవేయకండి అంటే వింటారా..? అందుకే జరిమానా రేంజ్ ని కనీవినీ ఎరుగని రీతిలో పెంచారు. చిన్న చిన్న కవర్లు రోడ్లపై పడేసినా రూ.5వేలతో ఫైన్ మోత మోగుతుంది. పదే పదే తప్పులు చేస్తుంటే జరిమానా ఏకంగా లక్షకు పెరుగుతుంది. దీని తర్వాతయినా జనంలో మార్పు వస్తుందేమోనని కార్పొరేషన్ ఆశిస్తోంది. జరిమానా మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.