Telugu Global
National

ఏ ప‌దాన్నీ 'నిషేధించలేదు': లోక్‌సభ స్పీకర్

పార్లమెంటు ఉభయ సభలలో కొన్ని ప‌దాల‌ను అన్‌పార్లమెంటరీగా పరిగణిస్తూ నిషేధించిన‌ట్టు లోక్‌సభ సచివాలయం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న దుమారం రేపుతోంది.

ఏ ప‌దాన్నీ నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్
X

పార్లమెంటు ఉభయ సభలలో కొన్ని ప‌దాల‌ను అన్‌పార్లమెంటరీగా పరిగణిస్తూ నిషేధించిన‌ట్టు లోక్‌సభ సచివాలయం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న దుమారం రేపుతోంది. దీంతో లోక్ స‌భ స్పీక‌ర్ ఓం ప్రకాష్ బిర్లా జోక్యం చేసుకుని వివాదాన్ని స‌ద్దుమ‌ణిగించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ "ఏ పదాన్నినిషేధించలేదు" సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛ‌గా వ్యక్తీకరించవ‌చ్చు అని అన్నారు.

''సభ్యుల నుండి ఆ హక్కును ఎవరూ లాక్కోలేరు అయితే అది పార్ల‌మెంటు హుందాత‌నానికి గౌర‌వానికి భంగం క‌లిగేలా ఉండ‌కూడదు'' అని బిర్లా చెప్పారు. పార్లమెంటరీ పద్ధతులపై అవగాహన లేని వ్యక్తులు ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తారని, చట్టసభలు స్వతంత్రంగా ఉంటాయని లోక్‌సభ స్పీకర్ అన్నారు. అయినా తాము విడుదల చేసిన జాబితాలో ఉన్నప‌దాలు గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలని చెప్పారు. అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీల డిక్షనరీని విపక్ష స‌భ్యులు చదివారా అని ఓం బిర్లా ప్రశ్నించారు. ఒకవేళ చదివి వున్నట్టయితే ఇలాంటి దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని అన్నారు.

నిషేధించిన పదాలను తాను సభలో వాడతానని... తనను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేసుకోవచ్చని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సవాల్ చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఇది ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై చ‌ర్చ‌ల‌ల్లో మాట్లాడ‌కుండా నిషేధం విధించ‌డ‌మే అని విమ‌ర్శించారు."న్యూ ఇండియా ఫర్ న్యూ డిక్షనరీ'' అంటూ రాహుల్ గాంధీ తన‌ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పేర్కొన్నాడు.

జూలై 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అన్‌పార్లమెంటరీ పదాలు, వ్యక్తీకరణల జాబితాతో కూడిన బుక్‌లెట్ ను పార్లమెంట్ అధికారులు విడుదల చేశారు. దానిలో.. 'అరాచకవాది', 'శకుని', 'నియంతృత్వం', 'తానాషా', 'తానాషాహి', 'జైచంద్' వంటి పదాలు చేర్చింది. 'వినాష్ పురుష్', 'ఖలిస్తానీ' వంటి ప‌దాల‌ను చర్చల సమయంలో లేదా ఉభయ సభలలో ఉపయోగించినట్లయితే వాటిని కూడా తొలగిస్తార‌ని పేర్కొంది.

First Published:  14 July 2022 7:48 PM IST
Next Story