Telugu Global
National

ఢిల్లీలో అది లేనిదే పెట్రోల్ కొనలేరు..

పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్, డీజిల్ అమ్మాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో అది లేనిదే పెట్రోల్ కొనలేరు..
X

హెల్మెట్ లేనిదే పెట్రోల్ అమ్మకం కుదరదంటూ ఆమధ్య ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆ నిర్ణయాల అమలు మాత్రం ప్రశ్నార్థకమే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అయితే ఇప్పుడు హెల్మెట్ తప్పనిసరి కాదు, పొల్యూషన్ సర్టిఫికెట్ మాత్రం తప్పనిసరి. పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్, డీజిల్ అమ్మాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాలుష్య నివారణకు..

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పాళ్లు చాలా ఎక్కువ. అందులోనూ శీతాకాలానికి ముందుగా కాలుష్య ప్రభావంతో పొగమంచు దట్టంగా పట్టేస్తుంది. కాలుష్య వాతావరణంతో ఆరోగ్యం చెడిపోవడమే కాదు, అనేక ప్రమాదాలకు కూడా అది కారణం అవుతుంది. సరి-బేసి విధానం, నిర్మాణ రంగానికి హాలిడేస్, స్కూళ్లకు హాలిడేస్.. ఇలా చాలా ప్రయోగాలు చేసినా ఏదీ సక్సెస్ కాలేదు. కాలుష్యం పాళ్లు తగ్గలేదు. తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది ఆమ్ ఆద్మీ సర్కారు. పెట్రోల్ కొట్టించుకోడానికి వచ్చే వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది.

ఇకపై ఢిల్లీలో పెట్రోల్ బంకులోకి వెళ్లాలంటే డబ్బులతోపాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ ఉన్నవారికి మాత్రమే ఢిల్లీలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోస్తారు. ఈ నిర్ణయం ఈనెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి యాంటీ డస్ట్‌ క్యాంపెయిన్‌ ప్రారంభిస్తున్నామని చెప్పారాయన. నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కాలుష్య కారకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

First Published:  1 Oct 2022 4:27 PM IST
Next Story